మెట్రో రైలు అందరికీ ఉపయోగపడాలి

హైదరాబాద్ ప్రజలకే కాకుండా నగరానికి వచ్చిపోయే రైలు, విమాన ప్రయాణికులకూ ఉపయోగపడేలా మెట్రోరైలు మార్గం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మెట్రో పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు కృషిచేస్తున్న ఆయా శాఖల అధికారులను సీఎం ప్రశంసించారు. సచివాలయంలో మంగళవారం మెట్రోరైలు ప్రాజెక్టుపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లు, జూబ్లీ బస్‌స్టేషన్, ఇమ్లీబన్ బస్‌స్టేషన్‌ వద్ద ప్రయాణికులు ఎక్కువగా వచ్చిపోతుంటారని, వారంతా మెట్రో రైలు సేవలను వాడుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.

KCR review meet with Metro Rail authorities

-2017 ఏప్రిల్ నాటికి పనులు పూర్తి
-విద్యుత్ సబ్సిడీకి సీఎం కేసీఆర్ అంగీకారం
-మెట్రో రైలు ప్రాజెక్టుపై ఉన్నతస్థాయి సమీక్ష
-మొత్తం 72 కి.మీ.కు గాను 19 కి.మీ పూర్తి
-వివరించిన అధికారులు.. సీఎం సంతృప్తి
గతంలో ప్రాజెక్టును డిజైన్ చేసిన వారు శంషాబాద్ విమానాశ్రయాన్ని విస్మరించారన్న సీఎం.. ఫలక్‌నుమా, రాయదుర్గంనుంచి శంషాబాద్‌కు మెట్రోమార్గం వేయాలని అన్నారు. ఎల్బీనగర్‌ నుంచి చాంద్రాయణగుట్ట మీదుగా కూడా మార్గాన్ని వేసే అవకాశాలను పరిశీలించాలని, ఇన్నర్ రింగ్‌రోడ్డును ఆనుకుని రైలు మార్గం నిర్మించాలని అధికారులకు సూచించారు.

2012 మార్చిలో ప్రారంభమైన మెట్రోరైలు పనులు 2017 ఏప్రిల్ నాటికి పూర్తి కావాల్సి ఉందని, ఇప్పటివరకు పనులు ఆశించిన రీతిలో జరుగుతున్నాయని సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. మొత్తం 72 కి.మీ.కు గాను 19 కి.మీ. మేరకు పూర్తిస్థాయిలో పనులు జరిగాయని అధికారులు సీఎంకు చెప్పారు. నాగోల్-మెట్టుగూడ 8కి.మీ., మియాపూర్-ఎస్‌ఆర్‌నగర్ 11 కి.మీ. పనులు పూర్తయ్యాయని, ట్రయల్ కూడా విజయవంతంగా నడుస్తున్నదని చెప్పారు. 49 కి.మీ.లకు ఫౌండేషన్ పూర్తయిందని, 45 కి.మీ. మేర పిల్లర్లు కూడా నిర్మించామని తెలిపారు.

-మెట్రో రైలుకు సబ్సిడీ విద్యుత్
మెట్రోరైలు ప్రాజెక్టుకు అవసరమైన విద్యుత్‌ను సబ్సిడీ ధరకు అందించడానికి సీఎం అంగీకరించారు. నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతి ఆదివారం సచివాలయంలో సీఎస్ ఆధ్వర్యంలో సమీక్ష జరుపుతున్నట్లు చెప్పారు. మెట్రో ప్రాజెక్టుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2వేల కోట్లు కేటాయించిందని, భూసేకరణ, పునరావాసం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలను ప్రభుత్వమే చేపడుతున్నదని తెలిపారు. రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న ఒకటిన్నర కిలోమీటర్ల మార్గంలో అనుమతులకోసం సంబంధిత మంత్రితో మాట్లాడి మూడేండ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరించినట్లు గుర్తుచేశారు.

రైల్వేలైన్ల వద్ద 8 ఆర్‌వోబీలు నిర్మించడానికి కూడా అనుమతులు లభించినట్లు సీఎం వెల్లడించారు. ఈ చర్యల ద్వారా మెట్రో పనులు వేగవంతమయ్యాయన్నారు. మెట్రోరైలు స్టేషన్లలో, రైళ్లలో భద్రతాచర్యలపై కూడా సీఎం సంబంధిత శాఖల అధికారులకు సూచనలిచ్చారు. రాష్ట్ర పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని, వారితో కలిసి భద్రత వ్యూహం రూపొందించాలని మెట్రో ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. ఢిల్లీ మెట్రోరైల్ అవలంబిస్తున్న భద్రతా విధానాలను అమలు చేయాలని చెప్పారు.

అన్ని రకాల అగ్నిమాపక అనుమతులు జారీచేసి, సంబంధిత ఫైళ్లపై సీఎం ఈ సమావేశంలోనే సంతకం చేశారు. సమావేశంలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, సీఎస్ రాజీవ్‌శర్మ, మెట్రో చైర్మన్ ఎంవీఎస్ రెడ్డి, ఎల్‌అండ్‌టీ సీఈవో గాడ్గిల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, జంటనగరాల పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, కలెక్టర్లు నిర్మల, రఘునందన్, ప్రభుత్వ కార్యదర్శులు మీనా, బుర్రా వెంకటేశం, అరవింద్‌కుమార్, సీఎంవో కార్యదర్శి నర్సింగ్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు.