మెడికల్ హబ్‌గా హైదరాబాద్

– స్టార్ ఆస్పత్రికి ప్రభుత్వపరంగా సాయం
– ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు హామీ

KCR-inaugurating-star-hospitals

హైదరాబాద్ నగరం మెడికల్ హబ్‌గా మారిపోయిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇవాళ దేశంలో అత్యధిక సంఖ్యలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు నగరంలోనే ఉన్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో న్యూరోసైన్స్ అండ్ ట్రామా, ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్‌మెంట్, రుమటాలజీ, ఈఎన్‌టీ, న్యూరాలజీ, యూరాలజీ తదితర విభాగాలను గురువారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు గొప్ప భవిష్యత్తు ఉందన్నారు. ఇప్పటికే జాంబియా, మొజాంబిక్, గల్ఫ్ వంటి దేశాలనుంచి వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారని గుర్తు చేశారు. ప్రజల్లో కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందని చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్‌కు గుర్తింపు,

అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో వైద్యులు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారన్నారు. స్టార్ ఆస్పత్రి విస్తరణకు, నూతన భవన నిర్మాణానికి భూమి కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. తనకు ఊహ తెలిసినప్పటినుంచి 52ఏళ్ల వయసు వరకు డాక్టర్‌కు చేయి ఇవ్వలేదని కేసీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. ఉద్యమ సమయంలో మాత్రం బీపీ వచ్చింది. జీవితమంతా మందులు వాడాలని డాక్టర్లు చెప్పారని కేసీఆర్ వివరించారు. మందులు వేసుకోవడం ఇష్టం లేకున్నా తప్పనిసరై వాడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ 20ఏళ్ల క్రితం రాజకీయ నాయకులు ఛాతీ నొప్పి వస్తే విమానంలో అమెరికాకు వెళ్లేవారని, ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, మంత్రి జోగు రామన్న, స్టార్ ఆస్పత్రి ఛైర్మన్ నాగార్జునరెడ్డి, గోపీచంద్ కూడా పాల్గొన్నారు.