మీ కల సాకారమైంది

-రాష్ర్టాభివృద్ధికి అన్నివర్గాలను కలుపుకొని వెళ్లండి:టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో గవర్నర్
-అపాయింటెడ్ డే తర్వాత ప్రమాణస్వీకారం..
-కేసీఆర్ బృందానికి సూచించిన నరసింహన్
-రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్యెల్యేలు
-టీఆర్‌ఎస్‌ఎల్పీ తీర్మానం అందించిన ఈటెల
-కేసీఆర్‌కు అభినందనలు తెలిపిన గవర్నర్
-భేటీలో పవర్‌పై సరదా మాటలు.. హరీశ్‌రావు రాలేదా.. అని ఆరా!
-కేసీఆర్‌కు మోడీ అభినందనలు
-ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానం

KCR With Governor

తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి కాబోతున్న టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావుకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం కేసీఆర్‌తో మోడీ ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణలో సంపూర్ణ మెజార్టీతో విజయం సాధించినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోడీ, తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ కూడా కేసీఆర్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

మీ కలను సాకారం చేసుకున్నారు.. అనుకున్న లక్ష్యం సాధించారు..ఇక రాష్ర్టాన్ని బాగా అభివృద్ధి చేసుకోండి.. అన్ని వర్గాలవారిని కలుపుకొని ముందుకు వెళ్లండి అని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో అన్నారు. ఆదివారం రాజ్‌భవన్‌లో కేసీఆర్ నాయకత్వంలో తనను కలిసిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందంతో ఆయన సంభాషించారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతలు కేసీఆర్‌ను తమ సభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని ఆయనకు వివరించారు.

ఈ మేరకు శనివారం టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో తాము ఆమోదించిన ఏకగ్రీవ తీర్మాన ప్రతిని ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు గవర్నర్‌కు అందజేశారు. తాజా ఎన్నికల్లో పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన విషయాన్ని ఆయనకు వివరించారు. అంతకుముందు రాజ్‌భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్యేల బృందం అక్కడ హాలులో గవర్నర్ రాకకోసం వేచిఉన్న సమయంలో కేసీఆర్ కూర్చుని ఉన్న సీటుకు వెనుకవైపు ద్వారం గుండా నరసింహన్ లోపలికి వచ్చారు. సీట్లో కూర్చుని ఉన్న కేసీఆర్‌ను గమనించిన గవర్నర్ వెనుకవైపునుంచి ఆయన భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలుకరించారు. కేసీఆర్ లేచి ఆయనకు అభివాదం చేసి పుష్పగుచ్ఛం అందజేశారు. మందహాసంతో దాన్ని అందుకున్న గవర్నర్ తాను కూడా కేసీఆర్‌కు బోకేను ఇచ్చి ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యేలను గవర్నర్‌కు పరిచయం చేశారు. కుశల ప్రశ్నల అనంతరం గవర్నర్ ఎమ్మెల్యేలతో కాసేపు మాట్లాడారు.

బంగారు తెలంగాణగా మార్చుకుంటాం: ఈటెల
దగాపడ్డ తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే శక్తి, దమ్ము, ధైర్యం ఒక్క కేసీఆర్‌కు మాత్రమే ఉందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలంతా కూడా ఇదే భావించి టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారని, వారి మనోభావాలకు అనుగుణంగానే శనివారం కేసీఆర్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నామని ఆయన అనంతరం మీడియాతో చెప్పారు. సంప్రదాయం ప్రకారం గవర్నర్‌ను కలిసి అన్ని అంశాలను వివరించామని తెలిపారు.

ఇన్నాళ్లూ ఉద్యమ సారథిగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా కొనసాగుతారని తెలిపారు. మ్యానిఫెస్టోలో రాసుకున్నదాని ప్రకారంగా, ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. గవర్నర్ కూడా సహకరించాల్సి ఉంది కాబట్టి ఆయన సహకారం అడిగామని చెప్పారు. అపాయింటెడ్ డే అయిన జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే నూతన ప్రభుత్వం ఏర్పడుతుందని, ఎక్కడ కూడా జాప్యం ఉండదని తెలిపారు. గవర్నర్‌తో సమావేశంలో ఇతర అంశాలేవీ చర్చకు రాలేదని తెలిపారు.

కేసీఆరే సీఎం అని ప్రజలకు తెలుసు: శ్రీనివాస్‌గౌడ్
కేసీఆరే కాబోయే ముఖ్యమంత్రి అని ఎన్నికల ముందే ప్రజలకు చెప్పామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పునర్‌నిర్మాణం ఎవరి చేతుల్లో ఉండాలనే అంశంపై ప్రజలకు చాలా స్పష్టత ఉందన్నారు.

కేసీఆర్ ను సీఎంను చేసేందుకే ప్రజలు తమను గెలిపించారని తెలిపారు. వీలైనంత తొందరగా ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని గవర్నర్‌ను కోరామన్నారు.తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టడం అంటే ప్రజలు స్వాతంత్య్రం వచ్చినట్లుగా భావిస్తున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, రాజయ్య, మధుసూదనాచారి, బోడిగ శోభ, జీవన్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, మహమూద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.

గవర్నర్ నరసింహన్, కేసీఆర్ మధ్య సాగిన సరదా సంభాషణ ఇది..
గవర్నర్: మీ కలను సాకారం చేసుకున్నారు.. అభినందనలు.
కేసీఆర్: థాంక్యూ.. ఇకపై మీ సహకారం కావాలి.
గవర్నర్: తప్పకుండా. అనుకున్న లక్ష్యం సాధించారు.. ఇక రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోండి. అన్ని వర్గాల వారినీ కలుపుకుని ముందుకు వెళ్లండి.
కేసీఆర్: అలాగే సర్.
గవర్నర్: సో.. ఇక మీరు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. అపాయిండెడ్ డే తరువాత ఈ కార్యక్రమం పెట్టుకోండి.