మీడియా ముసుగులో ఇడియట్ పనులా?

-మెడలు ఇరిసి అవతల పారేస్తం
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిస్తే పది కిలోమీటర్ల లోతున పాతరేస్తం
-శాసనసభను అవమానిస్తారా? ..
-ఎన్నిగుండెలు మీకు?.. ఇదా పత్రికా స్వేచ్ఛ?
-నిప్పులు చెరిగిన కేసీఆర్

KCR 10
మీడియా ముసుగులో ఇడియట్ పనులుచేస్తే మెడలు ఇరిసి అవతల పారేస్తం ఏమనుకుంటున్నరో.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉగ్రనరసింహుడయ్యారు. కాళోజీ కళాకేంద్రం శంకుస్థాపన కార్యక్రమం అనంతరం నిట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ మీరు కేసీఆర్‌ను వ్యక్తిగా విమర్శిస్తే నాకేం భయం లేదు. బాధలేదు. కేసీఆర్‌కు వ్యతిరేకం అయితే డోంట్ కేర్.

కానీ తెలంగాణ రాష్ర్టానికి తలవంపులు తెచ్చేవిధంగా, అవమానాలకు గురిచేసేవిధంగా, ఆత్మగౌరవాన్ని, ఉనికిని, అస్తిత్వాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదు. పది కిలోమీటర్ల లోతులో పాతరేస్తం జాగ్రత్త అని తెలంగాణ వ్యతిరేక మీడియాను హెచ్చరించారు. వరంగల్‌కు రాగానే కొందరు మీడియా మిత్రులు వచ్చి నన్ను కలిశారు. వారి సమస్యలు చెప్తూ వినతిపత్రం ఇచ్చారు. తర్వాత ఆ రెండు చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించాలని అడిగారు. మీడియా స్వేచ్ఛ గురించి కొందరు మాట్లాడుతున్నారు. నిజంగానే మీడియాకు స్వేచ్ఛ ఉండాల్సిందే.

కానీ, మీడియాకు కూడా సోయి ఉండాలె కదా! మీడియా స్వేచ్ఛ పేరుతో ఇష్టం ఉన్నట్లు రాస్తరా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలిరోజే తెలంగాణ శాసనసభను, శాసన సభ్యులను పాచికల్లు తాగిన మొఖాలని అంటారా? ల్యాప్‌ట్యాప్ ఇస్తే ఎక్కడో మడిచిపెట్టుకుంటరు అని ప్రసారం చేస్తారా? టూరింగ్ టాకీస్‌లో సినిమాలు చూడనివాళ్లను మల్టీప్లెక్స్‌లో కూర్చోబెట్టినట్టుంది అంటూ మా శాసనసభ్యుల్ని, శాసనసభను అవమానిస్తారా? ఎన్ని గుండెలు మీకు? ఇదా పత్రికా స్వేచ్ఛ? రమ్మనండీ.. ఎవరు మాట్లాడుతారో! మాకూ మేధావులున్నారు. మంచిగ ఉంటే మేము మంచిగనే ఉంటం. కానీ మా ఆత్మగౌరవాన్ని అవమానపరిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం. వాళ్లను ఏం చేయాల్నో అది చేస్తం అని సీఎం తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నన్ను తిడితే వ్యక్తిగతంగా తిట్టుండ్రి.

ఎంతోమంది తిట్టిండ్రు. కానీ తెలంగాణ ప్రజలను, తెలంగాణ సంస్కృతిని, ఆత్మగౌరవాన్ని కించపరిస్తే, అవమానపరిస్తే.. పాతర.. పది కిలోమీటర్ల లోతున పాతరేస్తం జాగ్రత్త అని కేసీఆర్ హెచ్చరించారు. అయినా ఆ రెండు చానళ్ల వ్యవహారం స్పీకర్ వద్ద విచారణలో ఉందని అన్నారు. అన్ని పార్టీల శాసనసభ్యులు తీర్మానించి స్పీకర్‌కు నిర్ణయాధికారం అప్పగించారని గుర్తు చేశారు. ఆ విచారణ పూర్తేకాలేదు. ప్రజలు ఎవరూ ఆ రెండు చానళ్లను కోరుకుంటలేరే! ఎందుకింత రాద్ధాంతం? ఎవరి ప్రయోజనాల కోసం మీరు ఇదంతా? తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉండాలనుకుంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని గౌరవించాలె అని స్పష్టం చేశారు. కాళోజీ గడ్డమీద ఆయన చెప్పిన మాటల్నే సీఎంగా చెప్తున్న.

ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే,ప్రాంతందాకా తన్ని తరుముతం. ప్రాంతంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాతరేస్తం అని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే మెడలు ఇరిసి అవతల పారేస్తం అన్నారు. దెయ్యం వదిలే ముందు పిచ్చి పిచ్చి చేష్టలు జేస్తదంటరు. గదే గీ నిరసనలు, నల్ల జెండాలు. అది ఒట్టిగ ఒదులుతాది! యాపకొమ్మల దెబ్బలు తినే వదులతది అన్నారు. ప్రసారాలను నిలిపిన ఎంఎస్‌ఓవోలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. ఆంధ్రవాళ్ల తరఫున తెలంగాణ బిడ్డలైన జర్నలిస్టులు వకాల్తా పుచ్చుకోవద్దని సీఎం సూచించారు.