మేయర్ల సదస్సుకు రండి

-గవర్నర్‌ను ఆహ్వానించిన సీఎం కేసీఆర్..
-సుదీర్ఘ భేటీలో కీలక అంశాలపై చర్చ

KCR with Governor Narsimhan
అంతర్జాతీయ మేయర్ల సదస్సు (మెట్రో పొలిస్)ను హైదరాబాద్‌లో అక్టోబర్ 7 నుంచి 9 వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని ఆహ్వానించామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరుకావాలని గవర్నర్‌ను సీఎం కోరారు. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 3 గంటలపాటు గవర్నర్‌తో భేటీ అయిన ముఖ్యమంత్రి బతుకమ్మ పండుగ, నగర బ్రాండ్ ఇమేజ్ పెంపుదలకు చేపట్టిన కార్యక్రమాలు, ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, రాష్ట్ర విభజన క్రమంలో ఎదురవుతున్న సమస్యలు వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. అధికారులెవరినీ అనుమతించకుండా గవర్నర్, ముఖ్యమంత్రి మాత్రమే సమావేశమయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లోని 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్నట్టుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేకంగా హెచ్‌వోడీలను ఏర్పాటు చేసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి, హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సాకుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదని గవర్నర్‌కు సీఎం కేసీఆర్ వివరించారు.
రాష్ర్టానికి సొంతంగా ఈ సంస్థలను ఏర్పాటు చేసుకునే వెసులుబాటును రాష్ట్రపునర్విభజన చట్టమే కల్పించిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి భవనం కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు లేఖలు రాసినా స్పందించని విషయాన్ని గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. మెట్రోపొలిస్ సదస్సుకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లను నరసింహన్‌కు కేసీఆర్ వివరించారని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి అంతర్జాతీయ సదస్సు ఇదేనని, దీనికి 60 దేశాలనుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని గవర్నర్‌కు చెప్పారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి, నగరంలోని రోడ్లు, డ్రైనేజీ, రవాణా వ్యవస్థలను మెరుగుపర్చడానికి, బ్రాండ్ ఇమేజ్ పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం తయారుచేస్తున్న ప్రణాళికను వివరించారు. హైదరాబాద్‌ను వైఫై సిటీగా, ఐటీ హబ్‌గా మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.

వైభవంగా బతుకమ్మ
తెలంగాణ ప్రజలు ఎంతో వేడుకగా జరుపుకునే బతుకమ్మ పండుగను ఈసారి ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని గవర్నర్‌కు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటున్న తొలి బతుకమ్మ పండుగను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నామని, దేశంలోని మహిళా ముఖ్యమంత్రులు, లోకసభ స్పీకర్, మహిళా గవర్నర్‌లు, అన్ని రాష్ర్టాల మహిళా మంత్రులను ఆహ్వానించి ట్యాంక్ బండ్‌పై భారీ స్థాయిలో వేడుక జరుపబోతున్నట్లు గవర్నర్‌కు వివరించారని సమాచారం. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పారిశ్రామిక విధానం, పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాయితీల కల్పన వంటి విషయాలను కూడా వివరించినట్లు తెలిసింది. వచ్చేనెల మొదటివారంలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం.

చానళ్ల నిలిపేతపైనా చర్చ!
రాష్ట్రంలో కొన్ని చానళ్లను ఎంఎస్‌వోలు నిలిపివేసిన అంశం కూడా గవర్నర్, సీఎంల మధ్య చర్చలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మీడియా చానళ్లపై ఆంక్షలు తప్పుడు సంకేతాలను ఇస్తాయని, ఈ విషయంలో ఆలోచించాలని సీఎంకు గవర్నర్ సూచించినట్లు సమాచారం. నిలిపివేసిన చానళ్ల ప్రసారాలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. కేంద్రం సూచన మేరకే గవర్నర్ ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు తెలుస్తున్నది.