మాతృభాషలోనే విద్యాబోధన జరుగాలి

– ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
మాతృభాషలో విద్యా బోధన జరిగితేనే విద్యార్థుల మానసిక వికాసం పెంపొందుతుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు కేవలం మార్కులు మాత్రమే కొలమానం కాదని, సామాజిక అంశాలను ఆకళింపు చేసుకునే నైపుణ్యం కూడా కావాల్సిందేనన్నారు. ఆదివారం కరీంనగర్‌లో జెడ్పీ-జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యం లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

Etela Rajendarరాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత ఉన్నది వాస్తవమేనని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. చట్టాలను సవరించైనా ప్రజాభివృద్ధికి పెద్దపీట వేసేందుకు సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలును ప్రధానోపాధ్యాయులకే అప్పగిస్తామని, 1 నుంచి పాఠశాలలకు సన్నపు బియ్యం పంపిస్తామని చెప్పారు.
పథకం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని, దుర్వినియోగం అయినట్లు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంటర్ తర్వాత ఇంగ్లిష్ మీడియంలో చేరాలని విద్యార్థులకు సూచించారు. అంగన్‌వాడీ సెంటర్లను బలోపేతం చేస్తామని, పిల్లలకు పౌష్టికాహారం, తల్లులకు, గర్భిణులకు రోజుకొక గుడ్డు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో మొదటిసారి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోనున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో ప్రభుత్వ ఛీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారధి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, బొడిగె శోభ, మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, కలెక్టర్ వీరబ్రహ్మయ్య, డీఈవో లింగయ్య తదితరులు పాల్గొన్నారు