మంత్రి హరీశ్‌కు మిచిగాన్ వర్సిటీ ఆహ్వానం

– చెరువుల పునరుద్ధరణపై ప్రసంగించాలని విజ్ఞప్తి
– మిషన్ కాకతీయ పథకానికి ప్రశంస.. మంత్రిని కలిసిన మిచిగాన్ ప్రతినిధి షమిత

Harish Rao with Michagan University delegates
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని అధ్యయనం చేయడానికి నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావుకు అమెరికాలోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ ఆహ్వానం పంపింది. ఈ మేరకు యూనివర్సిటీ ప్రతినిధి బృంద సభ్యురాలు షమిత గురువారం హరీశ్‌రావుని కలిశారు. మిషన్ కాకతీయ పథకంపై మిచిగాన్ యూనివర్శిటీ ప్రతినిధులు చేస్తున్న ప్రత్యేక పరిశోధన కోసం ఆ యూనివర్శిటీ 50 వేల డాలర్లను కేటాయించిన సంగతి తెలిసిందే. పరిశోధన బృందం ఇప్పటికే ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో పలు అంశాలపై పరిశోధనలు చేసింది.

తాజాగా మిషన్ కాకతీయ కార్యక్రమ విశిష్టతను, లక్ష్యాలను వివరిస్తూ తమ యూనివర్శిటీలో ప్రసంగించాలని కోరుతూ మంత్రి హరీశ్‌రావుకు మిచిగాన్ వర్శిటీ డీన్ మేరీ లిన్ మిరాండా స్వయంగా ఒక లేఖను రాశారు. ఆ లేఖను పరిశోధన బృంద సభ్యురాలు షమిత గురువారం సచివాలయంలో మంత్రి హరీశ్‌కు అందజేశారు. మిషన్ కాకతీయలో చెరువుల్లో పూడికతీత కార్యక్రమాన్ని ఒక ప్రధాన అంశంగా తీసుకున్నందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా మిచిగాన్ యూనివర్శిటీలో ప్రసంగించేందుకు తనను ఆహ్వానించినందుకు హరీశ్‌రావు కృతజతలు తెలియజేశారు. త్వరలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలున్నాయని, వీలైనంత తొందర్లోనే మిచిగాన్ యూనివర్సిటీకి వస్తానని మంత్రి హామీ ఇచ్చారు.