మన పరీక్షలు మనవే

-త్వరలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నియామకం
-ఏపీ పరీక్షలకు అవసరమైతే సహకారం
-విద్యాశాఖ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్

KCR 01

మన రాష్ట్రంలో మనమే పరీక్షలు నిర్వహించుకుందామని, ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి పరీక్షలకు అంగీకరించేది లేదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఇంటర్ పరీక్షల నిర్వహణపై విద్యా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇంటర్ పరీక్షల విషయంలో ఆంధ్రా ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యా మంత్రి, ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. అయితే తెలంగాణ ప్రాంతంలో ఏపీ ఇంటర్ బోర్డు కూడా ఉన్నదని, అందుకోసం అవసరమైతే ఏపీ పరీక్షల నిర్వహణ కోసం సహకారం అందించే అంశంపైనా సమావేశంలో చర్చించామని, త్వరలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ నియామకం చేపడతామని విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు.

పరిశ్రమల అవసరాలకు తగ్గట్టు ఇంజినీరింగ్ విద్య
రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యను బలోపేతం చేసే అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్యర్‌తో సీఎం కేసీఆర్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న ఐటీ, స్థానిక పరిశ్రమలకు అనుగుణంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆరునెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, త్వరలోనే చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మీడియాకు తెలిపారు.