మహిళా సాధికారతకే ప్రభుత్వ ప్రాధాన్యం

-వారి భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి అసాధ్యం
-మహిళల భద్రతకు టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
-అంతర్జాతీయ సదస్సులో రాష్ట్ర మంత్రి కే తారకరామారావు

KTR
మహిళా సాధికారత, పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాలు, రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో మహిళా సాధికారత- పేదరిక నిర్మూలన అనే అంశం పై హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న అంతర్జాతీయసదస్సును మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ సదస్సుకు 15 దేశాలకు చెందిన 30 మంది ప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు.

గ్రామీణ మహిళల సాధికారత, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఈ సదస్సులో చర్చించనున్నట్లు తెలిపా రు. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని, అందుకే తమ ప్రభుత్వం మహిళాభివృద్ధితోపాలు వారి భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. దళిత మహిళలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ఇటీవల చేసిన భూపంపిణీ పట్టాలు మహిళల పేరిటే మంజూరుచేశామని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. సామాజిక సమీకరణ ద్వారా 47.4లక్షల మంది మహిళలతో 4లక్షల 17వేల సమభావన సంఘాలను, రాష్ట్రవ్యాప్తంగా 18వేల గ్రామసంఘాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ మహిళాసంఘాలు అద్భుత ప్రగతి సాధించాయని అభినందించారు. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ రూరల్ ఇన్‌క్ల్యూసివ్ గ్రోత్ ప్రాజెక్టు (టీఆర్‌ఎల్‌ఈజీపీ) ద్వారా వ్యవసాయం, దాని అనుబంధరంగాలలో ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి పేదల జీవనోపాధి అవకాశాలు పెంపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐవీఆర్‌ఎస్ టెక్నాలజీని వినియోగిస్తూ స్త్రీనిధి ద్వారా గ్రామీణ పేద మహిళలకు కావల్సిన రుణాలను సకాలంలో తక్కువ వడ్డీకి అందిస్తున్నట్లు చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ.400కోట్ల రుణాలను మహిళలకు అందించినట్లు కేటీఆర్ చెప్పారు.

అనంతరం ఎన్‌ఆర్‌ఎల్‌పీఎస్ సంస్థ డైరెక్టర్ నిత కేజ్రేవాల్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల విశిష్ఠతలు, పనితీరు, సామాజిక భద్రత, సామాజిక సమీకరణ తదితర విషయాలను వివరించారు. ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్ (ఐవోఆర్‌ఏ) సంస్థ డైరెక్టర్ దల్హాన్ ఫిర్దోస్ మాట్లాడుతూ ఆదాయ, ఖర్చులలో మహిళలకు నిర్ణయాధికారం ఉండాలని పేర్కొన్నారు. మహిళాసాధికారత, పేదరిక నిర్మూలనకు అవసరమైన సహాయాన్ని సభ్యదేశాలకు అందించేందుకు ఐవోఆర్‌ఏ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సమావేశానికి భారత్‌సహా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెన్యా, మడగాస్కర్, మారిషస్, సిచెల్లిస్, సింగపూర్, దక్షిణాఫ్రికా, టాంజానియా, థాయిలాండ్, ఎమెన్, ఇండోనేషియా, ఇరాన్ దేశాలకు చెందిన 30 మంది ప్రభు త్వ అధికారులు పాల్గొన్నారు.

నేడు క్షేత్రస్థాయి పర్యటన
అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు గురువారం నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నారు. క్షేత్రస్థాయిలో సమభావన సంఘాల పనితీరు, గ్రామ, మండల, జిల్లా స్థాయి సమాఖ్యల పనితీరును పరిశీలిస్తారు. అదే విధంగా ఆయా జిల్లాల్లో ఐకెపీ కేంద్రాల పనితీరు, పేదరిక నిర్మూలనలో సంస్థల ఏర్పాటు విధానం, సంస్థలు సభ్యసంఘాల కు అందించే సేవల గురించి సభ్యులను వివిధ దేశాల ప్రతినిధులు అడిగి తెలుసుకుంటారు.