మహత్ముని కలలు నిజంచేద్దాం

-ప్రజల చేతుల్లోనే గ్రామాల సమగ్రాభివృద్ధి
-కమిటీలదే బాధ్యత.. గంగదేవిపల్లిగా మారాలి
-గ్రామజ్యోతి ప్రారంభోత్సవంలో ప్రజాప్రతినిధులు

Etala Rajendar addressing in Gramajyothi program in Karimnagar district

గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరం నడుం బిగిద్దాం.. గ్రామజ్యోతితో పల్లెలు ప్రగతి బాట పట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రజల చేతుల్లోనే గ్రామాల అభివృద్ధి ఆధారపడి ఉన్నదన్నారు. ప్రతి పల్లె గంగదేవిపల్లిగా మారాలన్నారు. గ్రామాల్లో విద్య, వైద్యం, తాగునీరు, రోడ్లు, వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూల న, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ యంత్రాంగంతోపాటు ప్రజలతో ఏర్పాటు చేసిన వివిధ కమిటీలను భాగస్వాములు చేసి పల్లెలను అన్నిరంగాల్లో అభివృద్ధిపరచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గ్రామజ్యోతి ద్వారా నాలుగేండ్లలో రూ.25వేల కోట్లతో పల్లెలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఉండే కమిటీల సూచన మేరకు ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లు వివరించారు.

ప్రగతికి తొలిమెట్టు: మంత్రి ఈటల రాజేందర్
గ్రామజ్యోతితో పల్లెలు ప్రగతి బాట పట్టనున్నాయని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం గుండేడ్, హుజూరాబాద్ మండలం కందుగులలో గ్రామజ్యోతి ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు చేపట్టిన జన్మభూమి, పల్లెబాట వంటి పథకాలతో గ్రామస్తుల కష్టాలు తీరలేదన్నారు. ఈ పథకం కోసం నిర్ధేశించిన ఏడు కమిటీలు నిరంతరాయంగా పనిచేయాలని సూచించారు. తెలంగాణ సంపదకు ప్రజలే యజమానులని, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార గణం మొత్తం జీతాగాళ్లే అని గ్రామస్తులతో చెప్పారు.

సమిష్టిగా అభివృద్ధి చేసుకోవాలి: మంత్రి హరీశ్‌రావు
గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా గ్రామజ్యోతిని రూపొందించామని, సీఎం కేసీఆర్ ఆశయాలకు గ్రామాభివృద్ధి కమిటీలు సమిష్టిగా పనిచేసి ప్రతి పల్లెను గంగదేవిపల్లిలా తయారు చేయాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్, మా టిండ్ల గ్రామాలను మంత్రి దత్తత తీసుకుని గ్రామజ్యోతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్దిపేట నియోజకవర్గంలో 75 పంచాయతీలుండగా 42 పంచాయతీలు నిర్మల్ పురస్కార్ సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచాయన్నారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట, పాపన్నపేట మండలం చిత్రియాల పరిధిలోని ఎన్కెపల్లిలో గ్రామజ్యోతిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

గ్రామజ్యోతితో పల్లెల్లో వెలుగులు: మంత్రి పోచారం
కుల, మత, రాజకీయాలకతీతంగా గ్రామజ్యోతికి ప్రజలు సహకరించాలని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన దత్తత తీసుకున్న నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌లో గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామజ్యోతిలో అభివృద్ధికి ప్రణాళికలు వేసుకుని పల్లెల్లో వెలుగులు నింపాలన్నారు. బాన్సువాడ మండలంలోని మంత్రి స్వగ్రామం పోచారంతోపాటు వర్ని మండలంలోని రుద్రూరు, కోటగిరి మండలంలోని సోంపూర్, కోటగిరి, బీర్కూర్‌ను దత్తత తీసుకున్నారు.