మగ్గానికి కార్మికుడే యజమాని

-దేశంలోనే తొలిసారిగా మరమగ్గ కార్మికులకు పథకం
-220కోట్లతో సిరిసిల్ల జిల్లాలో 50 శాతం సబ్సిడీపై మగ్గాల అందజేత
-మొదటి దశలో 1104 మందికిలబ్ధి
-ఒక్కో కార్మికుడికి 20లక్షల ప్రయోజనం

ఇప్పటిదాకా మరమగ్గాలపై పనిచేస్తున్న కార్మికులు.. త్వరలో సొంతంగా మగ్గాలు ఏర్పాటు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంచేసింది. మరమగ్గాలతో పనిచేస్తున్న కార్మికులకు యజమానుల హోదా (వర్కర్ టూ ఓనర్) కల్పించడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. మరమగ్గాలు ఏర్పాటుచేసుకునేందుకు తగిన మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రతి కార్మికుడికి యాభైశాతం సబ్సిడీపై మరమగ్గాలను అందజేస్తారు. దేశంలోనే మరమగ్గ కార్మికులకు ఇటువంటి పథకం తొలిసారిగా తెలంగాణలో అమలుకానుండటం విశేషం. విడుతలవారీగా అమలుచేసే ఈ పథకంలో మొదటి దశలో మౌలికసదుపాయాల కల్పన, మరమగ్గాలకు సబ్సిడీ సహా రూ.220కోట్లకు పైగా వెచ్చించనుంది.

రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆదేశాలతో పథకం అమలుపై చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ ఇటీవలే సిరిసిల్లలో పర్యటించి కార్మికుల అభిప్రాయాలను సేకరించారు. ఒక్కో కార్మికుడికి మరమగ్గాల సబ్సిడీ, మౌలిక సదుపాయాల రూపంలో దాదాపు రూ.20 లక్షలకు పైగా సబ్సిడీతో పథకాన్ని ప్రభుత్వం అమలుచేయనుంది. 1104 మంది కార్మికులను మొదటి విడుతలో ఎంపికచేయాలని నిర్ణయించారు. రాబోయే డిసెంబర్‌నాటికి సొంత మరమగ్గాల మీద కార్మికులు వస్త్రాలను ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా నిర్ణయించారు.

మగ్గాలపై సగం సబ్సిడీ
కార్మికుడిని యాజమానిగా మార్చే క్రమంలో ఒక్కొక్కరికి నాలుగు మరమగ్గాలను అందజేస్తారు. ఒక్కోదానికి రూ.2 లక్షల చొప్పున నాలుగు మగ్గాలకు రూ.8 లక్షలు అవుతుంది. ఇందులో రాష్ట్ర ప్రభు త్వం సబ్సిడీ కింద రూ.4 లక్షలు అందచేయనుంది. రూ.2.40 లక్షలవరకు బ్యాంకు రుణం ఇప్పిస్తారు. మిగిలిన రూ.1.60 లక్షలను కార్మికుడు వెచ్చించాలి.

88 ఎకరాల స్థలంలో షెడ్లు
వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా కార్మికుడికి షెడ్డు నిర్మించి ఇస్తారు. దీనికోసం సిరిసిల్ల శివారులో 88 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూమిలో షెడ్లు నిర్మించడంతోపాటు తాగునీరు, రోడ్లు, కరంటు, మూత్రశాలలు, డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలన్నింటినీ చేనేత, జౌళి శాఖ కల్పించనుంది. మొత్తం 46 షెడ్లు నిర్మిస్తారు. ఒక్కో షెడ్డును 24మంది లబ్ధిదారులకు కేటాయిస్తారు.

త్వరలోనే మార్గదర్శకాలు: శైలజా రామయ్యర్
మరమగ్గ కార్మికులను యజమానులుగా మార్చాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశాలు ఇచ్చారని చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే అమలుకు మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.