మాది చేతల ప్రభుత్వం

-ఎన్నికల హామీలన్నీ అమలు చేస్తాం
-ఉపాధి హామీ కింద చెరువుల మరమ్మతు: హరీశ్‌రావు
మాది చేతల ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. ప్రజలకు అవసరమైన కొత్త పథకాలను కూడా ఖర్చుకు వెనుకాడకుండా చేపడతామని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల, మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం చౌదర్‌పల్లిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Harish Rao

పంట రుణాల మాఫీ వల్ల 35 లక్షల రైతు కుటుంబాలకు 19 వేల కోట్ల రూపాయల మేలు జరిగిందన్నారు. దసరా పండుగ నుంచి వృద్ధాప్య, వితంతు పెన్షన్లు అందుతాయన్నారు. నిరుపేద దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూపంపిణీ ఆగస్టు 15 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. పక్కా ఇండ్లనిర్మాణం అమలు చేస్తామని, అక్రమ తెల్లరేషన్ కార్డుల ఏరివేతపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

బతుకమ్మ పండుగను అధికారికంగా జరపడమేగాకుండా జిల్లాకు ఏటా రూ. కోటి ప్రభుత్వ నిధులను కేటాయిస్తామన్నారు. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్ళికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ. 50వేలు అందిస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. చెరువు ఒండ్రు మట్టి తరలింపును ఉపాధి హామీకి అనుసంధానం చేసి చిన్న, సన్నకారు రైతుల పొలాలకు ఉచితంగా అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీల డబ్బు వారం రోజుల్లోగా చెల్లించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

గొలుసుకట్టు చెరువుల నిర్మాణాన్ని పునరుద్ధరిస్తామని, ఇందుకోసం కట్టుకాలువలు తవ్వించడమేగాకుండా తూములు, అలుగుల మరమ్మత్తులు చేపడుతామన్నారు. అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుంటున్నారని, అభివృద్ధిలో అధికారులతో పాటు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని కోరారు. ఈ సందర్భంగా అభివృద్ధి ప్రణాళికపై మంత్రి పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని హరీష్‌రావు ప్రారంభించారు.