మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి..

-పత్తికొనుగోళ్ల వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
పత్తి రైతులు కనీస మద్దతు ధర పొందేలా సీసీఐ (భారత పత్తి సంస్థ) నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులకు మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. కనీస మద్దతు ధర పొందేందుకు అనుసరించాల్సిన పద్ధతులు, నాణ్యత ప్రమాణాలపై అవగాహన కల్పించేందుకు రైతు సోదరులకు విజ్ఞప్తి పేరిట రూపొందించిన వాల్‌పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ సంచాలకుడు ఏ శరత్‌తోపాటు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ వాల్‌పోస్టర్లను అన్ని మార్కెట్ యార్డుల్లో, కలెక్టర్ కార్యాలయాలు, మండల రెవెన్యూ, ప్రజా పరిషత్ కార్యాలయాల్లో, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో, ప్రధాన కూడళ్లలో అతికించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.

Harish Rao

పత్తి రైతులు తమ వెంట పత్తి గుర్తింపు కార్డును, బ్యాంక్ ఖాతా పుస్తకంలోని మొదటి రెండు పేజీల జీరాక్స్ ప్రతులను తప్పక తీసుకురావాలని, పత్తిని బస్తాల్లో లేదా బొరాల్లో కాకుండా విడిగా బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లు, డీసీఎంలతో తీసుకురావాలని అన్నారు. నాణ్యమైన పత్తిని తీసుకొస్తేనే సీసీఐ కొనుగోలు చేస్తుందని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణలో మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు జీ లక్ష్మిబాయి, సూపరింటెండెంట్ ఇంజినీర్ బీ నాగేశ్వర్‌రెడ్డి, ప్రాంతీయ సంయుక్త మార్కెటింగ్ సంచాలకుడు పీ రవి, ప్రాంతీయ ఉపమార్కెటింగ్ సంచాలకుడు ఈ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.