మాది చేతల ప్రభుత్వం

ఓ ప్రైవేట్ వ్యాపారి రైతులకు చెల్లించాల్సిన ఎర్రజొన్న బకాయిలు ఇవ్వకుండా చేతులు ఎత్తేస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని చెల్లించి రైతుపక్షపాతిగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో ప్రభు త్వం విడుదల చేసిన ఎర్రజొన్న బకాయిల చెల్లింపుల కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా రైతులకు రావాల్సిన ఎర్రజొన్న బకాయిలు చెల్లించలేదని మండిపడ్డారు.

-ఇచ్చిన మాట ప్రకారం ఎర్రజొన్న బకాయిలు చెల్లించాం
-రైతులు సోలార్ ద్వారా సాగుచేసుకోవాలి: మంత్రి పోచారం

Madi Chetala Prabutvam

బకాయిలు చెల్లించాలని రైతులు గతంలో ఆందోళనలు చేస్తే అప్పటి ప్రభుత్వం పోలీస్ లాఠీలతో సమాధానం చెప్పిందని గుర్తుచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించామని తెలిపారు. సోలార్ ద్వారా పంటల సాగు చేసుకోవడానికి రైతులు మొగ్గుచూపాలని, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు రూ.200 కోట్ల విడుదలకు సీఎం ఆమోదం తెలిపారన్నారు.

పంచాయతీరాజ్ రోడ్లు, అర్‌అండ్‌బీ రోడ్ల మరమ్మతులకు, కొత్త పనులకు, లింక్ రోడ్డు నిర్మాణాలకు అవసరం ఉన్న చోట రోడ్డు వెడల్పునకు, కల్వర్టులు, బ్రిడ్జిల నిర్మాణాలకు వేలాది కోట్ల రూపాయల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. వీటికి సంబంధించిన పనుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.25 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ పథకానికి ప్రభుత్వం శ్రీకారంచుట్టిందని వివరించారు. అనంతరం వేల్పూర్ మండలంలోని 600 మంది రైతులకు రావాల్సిన ఎర్రజొన్న బకాయిలు రూ.కోటి 48 లక్షల 25 వేల 288ల చెక్కును అందచేశారు.