మాది చేతల ప్రభుత్వం

హైదరాబాద్‌లో అందరూ హాయిగా బతకొచ్చు
-ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి
-గ్రేటర్‌లో అభివృద్ధికే ఓటేయండి
– మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన చిత్రపురి కాలనీ, మదీనాగూడ, నాగోల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు.

TRS-Public-Meeting-at-LB-Nagar

గత 18 నెలల్లో నగరం ఎంత ప్రశాంతంగా ఉందో అందరూ చూస్తున్నారని, తప్పుడు ప్రచారాలని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని, నిరంతర విద్యుత్, నీటిఎద్దడి నివారణకు చేపడుతున్న ప్రణాళికలు, స్కైవేల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను గురించి మంత్రి వివరించారు. అనంతరం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు వరంగల్‌లో పట్టిన గతే పడుతుందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల గడువు పెరగడం టీఆర్‌ఎస్‌కు అనుకూలమన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని మిగతా రాష్ర్టాలు, దేశాలు కొనియాడుతున్నాయన్నారు.

మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం పేదల పక్షపాతిగా నిలబడ్డారని, నగరంలో కారు జోరు ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. నగరంలో గురువారం ఉదయం నుంచి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి, గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధి చేసేవాళ్లను ఎన్నుకోవాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వ మాటలు చెప్పేది కాదని, చేతల ప్రభుత్వమని పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు ప్రతిపక్ష నేతలు అనేక దుష్ప్రాచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారని పేర్కొన్నారు. గురువారం గ్రేటర్ పరిధిలోని మణికొండలోని చిత్రపురి కాలనీతోపాటు ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్ నియోజక వర్గాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ ఒక్క ఘర్షణ జరగలేదని, ఎవ్వరిని ఇక్కడ నుంచి పంపించలేదన్నారు. ఎన్నికలు రాగానే ప్రతిపక్షాల వారు మరోసారి ప్రజలను గందరగోళం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.