మా విధానం పారదర్శకం

-పరిశ్రమల అనుమతికి ఏకగవాక్షం
– అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు
– త్వరలో చట్టం: సీఎం కేసీఆర్
– రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై పారిశ్రామిక దిగ్గజం సీకే బిర్లా ప్రశంసలు
– సిమెంట్, వైద్య రంగంలో పెట్టుబడులకు సంసిద్ధత

KCR 001
మొన్న అమెరికా బృందం.. నిన్న బిర్లా కంపెనీ.. రేపు మహీంద్ర అండ్ మహీంద్ర. ఇలా దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు హైదరాబాద్‌కు క్యూ కడుతున్నారు. వైమానిక, రక్షణ రంగాలలో పెట్టుబడులకోసం అమెరికా విదేశీ వాణిజ్య సేవల బృందం ముందుకువస్తే, శనివారం బిర్లా కంపెనీ సిమెంట్, వైద్య పరిశ్రమలలో పెట్టుబడులకోసం ముందుకు వచ్చింది.

మహీంద్ర అండ్ మహీంద్ర కంపెనీ వాహనాల ఉత్పత్తి కార్యకలాపాల విస్తరణకు రంగం సిద్ధంచేసుకుంటోంది. ఇదేదారిలో మరిన్ని సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. ఇదంతా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రేఖామాత్రంగా చెప్పిన పారిశ్రామిక విధానం ప్రభావమేనంటున్నారు అధికారులు. అవినీతికి, పైరవీలకు అవకాశంలేని విధానం ప్రకటిస్తామని కేసీఆర్ ఆ మధ్య ఓ కార్యక్రమంలో ప్రకటించారు. అనుమతుల కోసం ఏకగవాక్ష విధానం తెస్తామని, పారిశ్రామికవేత్తలు అధికారుల చుట్టూ తిరిగే పనిలేకుండా తామే ఆ పనులుచేసి అనుమతులు చేతికి అందిస్తామని చెప్పారు. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని పాలనా విధానంపై పారిశ్రామికవేత్తల్లో ఆసక్తి రేకెత్తింది.

పరిశ్రమలు పెట్టుకోవాలంటే ముందు లాబీయిస్టులను చూసుకోవాల్సిన స్థితే అనేక రాష్ర్టాల్లో ఉంది. అనుమతులకోసం భూ కేటాయింపులు తదితర సౌకర్యాల కోసం ఎంతో కాలహరణం జరుగుతూ వస్తున్నది. అలాంటి సమస్యలు లేని విధానం ఉంటుందని కేసీఆర్ ఇచ్చిన భరోసా పారిశ్రామికవేత్తల్లో ఉత్సాహం నింపింది. తెలంగాణ ప్రభుత్వం సరళీకృత, పారదర్శక పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని చేసిన ప్రకటనతో బడా కంపెనీలు హైదరాబాద్ చుట్టూ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యమంత్రి స్వయంగా తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో పారిశ్రామికవేత్తలలో మరింత విశ్వాసం పెరుగుతున్నది.

దేశంలోనే ప్రభావవంతం: బిర్లా
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం బిర్లా కంపెనీ తెలంగాణలో పారిశ్రామిక, వైద్య రంగంలో సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది. కంపెనీ చైర్మన్ సీకే బిర్లా , మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ కేత్ర శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యంత ప్రభావవంతమైందని బిర్లా ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు తెలంగాణ వైపు చూస్తున్నారని ఆయన సీఎంకు చెప్పారు. హైదరాబాద్‌తో తమకు ఎంతో అనుబంధం ఉందని వారు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమలను విస్తరించే అలోచన ఉందని ప్రతిపాదించారు. వైద్య రంగంలో సైతం భారీగా పెట్టుబడులు పెట్టి సేవారంగంలో కంపెనీని విస్తరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం సహకారం అందించాలని అభ్యర్థించారు.

వారి ప్రతిపాదనలు సీఎం ఆహ్వానించారు. ప్రభుత్వ సహకారానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పారిశ్రామిక రంగాభివృద్ధికి కృషి జరపాలనుకుంటున్నదని చెప్పారు. ఇందుకోసం సమగ్రంగా ఒక విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ పాలసీని తీసుకువస్తుందని వారికి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటు కోసమే దాదాపు రెండున్నర లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వారికి వివరించారు. పరిశ్రమల అనుమతుల విషయంలో విప్లవాత్మక మార్పు తేబోతున్నామని అన్ని అనుమతులకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉండేందుకు, కాలహరణం లేకుండా చూసేందుకు అత్యుత్తమమైన సింగిల్‌విండో విధానాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.

దీన్ని సీఎం కార్యాలయానికి అనుసంధానించి చేజింగ్‌ సెల్ ద్వారా రెండు వారాల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం తెస్తున్నామని వివరించారు. చైనాలో ఉన్నట్టే ఇక్కడ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇండస్ట్రియల్ పార్కులు వస్తున్నాయని చెప్పారు. ఇందుకోసం చట్టం కూడా తెస్తామని చెప్పారు. కేసీఆర్ వివరించిన నూతన పారిశ్రామిక విధాన వివరాలను ఆసక్తిగా విన్న సీకే బిర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఆ సమావేశంలో చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, పరిశ్రమల కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ పాల్గొన్నారు.

వెయ్యి కోట్లతో మహీంద్రా కార్ల కంపెనీ
మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ట్రాక్టర్ల ఉత్పత్తి కర్మాగారాన్ని నడుపుతున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఇపుడు కంపెనీని మరింత విస్తరించాలని నిర్ణయించింది. జహీరాబాద్‌లోనే కార్ల తయారీ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఉత్పాదక, రవాణా, మానవ వనరుల రంగంలో కలిసొచ్చే ప్రాంతంగా ఆ కంపెనీ గుర్తించింది. హైదరాబాద్‌ను దక్షిణాది రాష్ర్టాలకు కేంద్రంగా ఏర్పాటు చేసుకొని కార్యకలాపాలను నిర్వహించాలని నిర్ణయించింది.ఈ నేపథ్యంలో మరిన్ని ఉత్పాదక కేంద్రాలను ఇక్కడే ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించింది.

కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్రా శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి వాటిపై చర్చించారు. గతేడాది మార్చిలో ఇక్కడ స్థాపించిన ట్రాక్టర్ల తయారీ కర్మాగారం విజయవంతమైందని, ఇపుడు కార్ల కంపెనీని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామని చెప్పినట్టు తెలిసింది. ఈ కంపెనీ మరో మూడు, నాలుగు నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభిస్తుంది. దీనికి సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నారు. ప్రారంభోత్సవానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించినట్లు సమాచారం.