మా పిల్లల భవిష్యత్తే ముఖ్యం

-సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం
-విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy

ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో తెలంగాణ రాష్ట్ర పిల్లల భవిష్యత్తే తమకు ముఖ్యం తప్ప ఇతర రాష్ర్టాల వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా ఆత్మకూర్.ఎస్ మండలం నెమ్మికల్ దండు మైసమ్మ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం లో తెలంగాణ విద్యార్థులకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు దోచుకున్నారని ఆరోపించారు. దోపిడీకి వ్యతిరేకంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందని, రాష్ట్రం వచ్చిన తరువాత కూడా వారు పెత్తనం చెలాయిస్తామంటే ఊరుకుంటామా అని ప్రశ్నించారు. ఉద్యమంలో ఎంతో మంది తెలంగాణ విద్యార్థులు బలిదానాలు చేసుకోగా, మిగిలిన విద్యార్థుల చదువులకు అంతరాయం కలిగిందన్నారు. అలాంటి తమ పిల్లల భవిష్యత్ మాత్రమే చూసుకుంటామని, ఆంధ్రోళ్లతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

బోధనా రుసుంపై ఆంధ్రా సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు అర్థరహితమన్నారు. కేంద్రం ప్రభుత్వం, చంద్రబాబు కలిసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆంధ్రోళ్లకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో కాంగ్రెస్, టీడీపీలను భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగానే మన ఊరు – మన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 60 ఏండ్లుగా తెలంగాణ ప్రజల సొమ్ముతో ఆంధ్రోళ్లు బతికారని ఆరోపించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.