మా ప్రభుత్వం ఆదుకున్నది

గోకుల్ చాట్ పేలుడు ప్రమాదంలో గాయపడి.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురై తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న తెలంగాణ బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకున్నది. పేలుడు ప్రమాదంలో జీవచ్ఛవంలా మారిన యువ ఇంజినీర్ సదాశివారెడ్డికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.10 లక్షల చెక్కును బాధితుడి తల్లిదండ్రులు జీ మోహన్‌రెడ్డి, వసంతకు గురువారం సచివాలయంలోని సీ బ్లాక్‌లోని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అందజేశారు.

KTR handedover the cheque to the gokul chat bomb blast victim families

-గోకుల్‌చాట్ పేలుళ్లలో జీవచ్ఛవంలా మారిన సదాశివారెడ్డి
-గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్న తల్లిదండ్రులు
-బాధితుడికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం
-రూ.10 లక్షల చెక్కును అందజేసిన మంత్రి కేటీఆర్
ఎనిమిందేండ్ల క్రితం గోకుల్‌చాట్, లుంబిని పార్కుల్లో జరిగిన బాంబు పేలుళ్లలో బాధితులను, మృతుల కుటుంబాలను గత ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదనే విమర్శలు పెద్ద వచ్చిన సంగతి తెలిసిందే. ఆనాటి పేలుళ్లలో 49 మంది చనిపోగా, దాదాపు 67 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో సదాశివారెడ్డి తీవ్రంగా గాయపడి జీవచ్ఛవంలా మారారు. నాటి నుంచి నేటికి కూడా కోలుకోలేని పరిస్థితి నెలకొంది. తల్లిదండ్రులు తమకు అండగా ఉంటాడనుకున్న కొడుకుకు తామే అన్ని అయి చిన్నపిల్లాడికి చేసినట్లు సేవలు చేయాల్సి వస్తుందనే ఆవేదనకు గురయ్యారు.

ఆ సమయంలో వైద్యసేవలు చేయించి.. చేతులు దులుపుకున్న సీమాంధ్ర ప్రభుత్వం ఆ తర్వాత సదాశివారెడ్డి కుటుంబాన్ని వదిలేసింది. దీంతో సదాశివారెడ్డి కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురైంది. నేటికి వైద్యఖర్చులకు నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిసి కుటుంబ సభ్యులు తమ గోడును చెప్పుకున్నారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్ రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని సీఎం తరఫున మంత్రి కేటీఆర్ ఆ కుటుంబానికి చెక్కును అందజేశారు.

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు: బాధిత కుటుంబం
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తమకు ఆర్థిక సహాయం అందిందని బాధితుడు సదాశివరెడ్డి తల్లిదండ్రులు అన్నారు. సమైక్య రాష్ర్టానికి సీఎంలుగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు అసలు పట్టించుకోలేదని, దీంతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఈ సందర్భంగా తెలిపారు. మన వాళ్లు అధికారంలో ఉన్నారు. మన రాష్ట్రం వచ్చింది కాబట్టే మాకు సహాయం అందింది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక సహాయం చేసి ఆదుకున్న సీఎం కేసీఆర్‌కు సదాశివారెడ్డి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.