మా ఎంసెట్ మేమే నిర్వహిస్తాం

ఎంసెట్ పరీక్షను తాము సొంతంగానే నిర్వహించుకొంటామని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. అవసరమైతే ఆంధ్రప్రదేశ్‌కు ఎంసెట్ నిర్వహణలో సహకారం అందిస్తామే తప్ప ఉమ్మడిగా పరీక్ష నిర్వహించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. సోమవారం మధ్యాహ్నం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఎంసెట్ పరీక్ష నిర్వహణపై స్పష్టత ఇచ్చారు.

-ఉమ్మడి పరీక్షల ప్రసక్తేలేదు
-ఏపీ కలిసివస్తే సహాయం చేస్తాం
-గవర్నర్‌కు తెలిపిన మంత్రి జగదీశ్‌రెడ్డి
-ఎంసెట్ పరిస్థితిపై సీఎం కేసీఆర్‌కు వివరణ
-షెడ్యూల్ విడుదలకు అధికారుల ఏర్పాట్లు

Jagadish-Reddy

ఎంసెట్‌పై కొంతకాలంగా రెండు రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో గవర్నర్ ఇప్పటికే రెండుసార్లు సుదీర్ఘంగా చర్చించి పలు ప్రతిపాదనలు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఏకాభిప్రాయానికి రావాలని గవర్నర్ గతంలో సూచించారు. అయినా సమస్య కొలిక్కి రాకపోవటంతో మరోసారి విడివిడిగా కూడా మంత్రులతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి సోమవారం గవర్నర్‌ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 75 ప్రకారం తామే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు కలిసి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమతో పరస్పర అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం ఆయన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో సమావేశమై పరిస్థితిని వివరించారు. ఎంసెట్ నిర్వహణలో తమ వైఖరిలో మార్పులేదని గవర్నర్‌తో మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేయడంతో ఒకటిరెండు రోజుల్లో ప్రవేశపరీక్షల తేదీలను ప్రకటించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అడ్మిషన్లలో ఏ ప్రాంతం వారికీ అన్యాయం జరుగకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఇదివరకే ప్రవేశాల కమిటీలలో ఆంధ్రప్రదేశ్ అధికారులకు కూడా ప్రాతినిధ్యం కల్పించింది.