ఎల్‌ఈడీ వెలుగుల సిద్దిపేట!

-ఇక నియోజకవర్గంలో ఇంటింటా ఎల్‌ఈడీ బల్బులు
-మరో రికార్డు సృష్టిద్దామని మంత్రి హరీశ్‌రావు పిలుపు

Harish-Rao-inaugurating-distribution-ofLED-bulbs-in-siddipet

సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికే గ్రామగ్రామాన ఏటీడబ్ల్యూ (ఎనీటైమ్ వాటర్) ప్లాంట్లు. బహిరంగ మలవిసర్జన లేని స్వచ్ఛ సిద్దిపేట. హరితహారం వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టి రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ఇంటింటా ఎల్‌ఈడీ బల్బులు బిగించి విద్యుత్ ఆదాచేసి మరో రికార్డు సృష్టిద్దాం అని నియోజకవర్గ ప్రజలకు భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేట, నంగునూరు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సిద్దిపేటలో సమీకృత మార్కెట్‌కు శంకుస్థాపన చేసి, నూతన మార్కెట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటా ఎల్‌ఈడీ బల్బులు వాడినట్లయితే విద్యుత్‌ను పొదుపు చేయవచ్చన్నారు. గ్రామాలు పోటీపడి ముందుకొస్తే ఎల్‌ఈడీ బల్బులు బిగించి కరెంట్ ఆదా చేస్తున్న నియోజకవర్గంగా మరో రికార్డు సృష్టిద్దామన్నారు. ఒక్కో ఎల్‌ఈడీ బల్బు మార్కెట్‌లో రూ.300 ఉంటే రూ.100కే అందిస్తామన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు సంఘటితమై గ్రామానికి అవసరమైన బల్బులకు డబ్బులు చెల్లిస్తే వెంటనే అందజేస్తారన్నారు. ఇప్పటికే సిద్దిపేట మండలం ఇబ్రహీంపూర్‌లో ఎల్‌ఈడీ బల్బులు ఏర్పాటు మొదలైందన్నారు.

అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు: హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికీ ప్రభుత్వం సమానంగా సంక్షేమ పథకాలు అందజేసేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కల్యాణలక్ష్మి పథకాన్ని పేద క్రైస్తవులకు వర్తింపజేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రిస్మస్ సంబురాలను అధికారికంగా జరిపిస్తున్నారన్నారు.