లేటుగా వస్తే సహించేది లేదు

– ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులకు సున్నితంగా మందలింపు
– నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ..
– మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల హాజరుపై ఆరా

Harish Rao

రాష్ట్ర సచివాలయంలోని భారీ నీటిపారుదలశాఖ విభాగంలో మంత్రి హరీశ్‌రావు ఆకస్మిక తనిఖీ చేశారు. బుధవారం ఉదయం 10.30 నుంచి 12 గంటల మధ్య సచివాలయం బి-బ్లాక్‌లోని 3,4,5,6 అంతస్తుల్లోని నీటిపారుదలశాఖ విభాగాన్ని సందర్శించారు. ఆలస్యంగా వస్తున్న ఉద్యోగుల వివరాలు, ఉద్యోగులకు సమకూర్చాల్సిన మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు.
తొలుత భయపడిన ఉద్యోగులు.. మంత్రి ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో తేలికపడ్డారు. ఆలస్యంగా విధులకు హాజరైన ఉద్యోగులను మంత్రి సున్నితంగా మందలించారు. ఆలస్యంగా వస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు. ఈ విభాగాన్ని ఆధునీకరించాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషికి సూచించారు. వారంలో ఒక రోజు తప్పనిసరిగా సమీక్షా సమావేశం నిర్వహించాలని డిప్యూటీ కార్యదర్శితోపాటు ఇతర అధికారులకు సూచించారు. ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూడాలని, అలాగే ప్రతి విషయంలో పారదర్శకత పాటించాలని హరీశ్‌రావు ఆదేశించారు. ఎలాంటి హడావిడి లేకుండా మంత్రి పర్యటన సీక్రెట్‌గా సాగడం ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.