లక్ష్యాన్ని మించిన సభ్యత్వాలు

టీఆర్‌ఎస్ చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియ లక్ష్యాన్ని మించి నమోదవుతున్నది. మంగళవారం మహాశివరాత్రి పర్వదినం రోజు సైతం ప్రజలు సభ్యత్వం తీసుకునేందుకు క్యూ కట్టారు. ఊహించిన దానికన్నా రెట్టింపు స్పందన వస్తుండటంతో కార్యకర్తలు మరింత ఉత్సాహంతో సభ్యత్వ సేకరణ చేపడుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇప్పటికే నిర్ధేశించిన లక్ష్యందాటి నమోదయ్యాయి.
-పండుగరోజూ గులాబీ సభ్యత్వానికి క్యూకట్టిన ప్రజలు
-మరింత ఉత్సాహంగా పనిచేస్తున్న కార్యకర్తలు
పండగ రోజున అదే జోరు

Palla-Rajeshwar-Reddy

గ్రేటర్‌లో కార్యకర్తలు ఒక వైపు సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటూనే మరో వైపు పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను చేపట్టారు. మంగళవారం గ్రేటర్ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ మైనంపల్లి హన్మంతరావు సూడిగాలి పర్యటన చేశారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్, డోర్నకల్ నియోజవర్గాల్లో సభ్యత్వ నమోదు స్టీరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ పల్ల రాజేశ్వర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ ప్రొఫెసర్ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్, పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, స్టీరింగ్ కమిటీ సభ్యురాలు సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో సభ్యత్వాలు చేయించారు. రాయపర్తిలో పనికర మల్లయ్యకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు సభ్యత్వం అందజేశారు.

వర్ధన్నపేటలో ఎమ్మెల్యే అరూరి రమేశ్, వరంగల్ పశ్చిమలో పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయ్‌భాస్కర్, వరంగల్ తూర్పులో అర్బన్ పార్టీ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్, జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పరకాలలో చల్లాధర్మారెడ్డి పాల్గొన్నారు. నల్లగొండలోని శివాజీనగర్‌లో పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్‌కుమార్, సభ్యత్వ నమోదు కార్యక్రమ జిల్లా ఇన్‌చార్జి రావుల శ్రవణ్ కుమార్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఖమ్మంజిల్లాలోమంగళవారం సాయంత్రానికి సాధారణం 3,27,250, క్రియాశీలకం 95,000 సభ్యత్వాలను నమోదు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిలో నియోజకవర్గస్థాయి సభ్యత్వ నమోదు ప్రక్రియపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

కరీంనగర్‌లో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అదనపు సభ్యత్వ పుస్తకాలను ధర్నారం, వెల్గటూరు, ధర్మపురి మండల నేతలకు అందించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, గంగాధర మండలంలో ఎమ్మెల్యే బొడిగ శోభ, పార్టీ జిల్లా కన్వీనర్ ఈద శంకర్‌రెడ్డి పాల్గొన్నారు . రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మంగళవారం శంకర్‌పల్లి మండలం బూల్కాపురంలో సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్ పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, జిల్లా సభ్యత్వ నమోదు పరిశీలకుడు రూప్‌సింగ్ పాల్గొన్నారు.

పండుగ రోజూ అదే హోరు
నమస్తే తెలంగాణ, హైదరాబాద్: టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు మహా శివరాత్రి పండుగ రోజూ హోరుగానే కొనసాగింది. తెలంగాణభవన్ నుంచి హైదరాబాద్‌లోని మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, నాంపల్లి నియోజకవర్గాలతోపాటు నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, భువనగిరి, మహబూబ్‌నగర్ జిల్లాలోని నాగర్‌కర్నూల్, వరంగల్‌లోని డోర్నకల్ నియోజకవర్గాల నేతలు అదనంగా సభ్యత్వ పుస్తకాలు తీసుకెళ్లారు. మొత్తం 28,775 అదనపు పుస్తకాలిచ్చినట్లు స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50,86,585 సభ్యత్వాలకు సరిపడా పుస్తకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మంగళవారం నల్లగొండ జిల్లాలో 22వేలు, మెదక్‌లో 32వేలు, ఖమ్మంలో 52వేల సభ్యత్వాలు పెరిగాయని వివరించారు. ఇప్పటిదాకా అందిన సమాచారం మేరకే రాష్ట్రంలో సభ్యత్వాల సంఖ్య 38,12,725కు చేరిందన్నారు.