కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

గోదావరి పుష్కరాల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుంభమేళా తరహాలో పుష్కరాలు నిర్వహించాలని సోమవారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం నిర్ణయించింది. కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రభుత్వం ఏకంగా రూ.425 కోట్లు కేటాయించింది. వివిధ శాఖలు చేపట్టాల్సిన పనులకుగాను నిధుల కొరత లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఆర్‌అండ్‌బీ శాఖకు రూ.226 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.100 కోట్లు, నీటిపారుదలశాఖకు రూ.82 కోట్ల వంతున కేటాయించారు.

Cabinet Meeting on Godavari Pushkaraalu

-ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం.. ఏకంగా రూ.425 కోట్లు కేటాయింపు
-69 పుష్కర ఘాట్ల నిర్మాణం..పరిశీలనలో మరో పది.. రాష్ట్రపతి, ప్రధానికి ఆహ్వానం
-క్యాబినెట్ సబ్‌కమిటీ నిర్ణయం.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడి
ఆయా శాఖలు చేపట్టే పనులకు యుద్ధప్రాతిపదికన పరిపాలన, సాంకేతిక ఆమోదం తెలపాలని ఉన్నతాధికారులను క్యాబినెట్ సబ్‌కమిటీ ఆదేశించింది. కమిటీ చైర్మన్, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు.

ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పనులు హడావిడిగా పూర్తిచేసే తతంగానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. జూలై 14 నుంచి 25వ తేదీ వరకు పుష్కరాలు జరగనుండగా దానికి నెల రోజుల ముందుగానే అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. పనుల్లో నాణ్యత ఉండేటట్లు చూసేందుకు విజిలెన్స్ నిఘాను మొదటినుంచి కొనసాగించాలని కమిటీ సూచించింది.

గతంలో నిర్వహించిన పుష్కరాల్లో కేవలం 27 పుష్కర ఘాట్లు నిర్మిస్తే ఈ దఫా 69 నిర్మించాలని తీర్మానించారు. మరో పది చోట్ల కూడా ఘాట్లు నిర్మించేందుకు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ చర్చించింది. ప్రధానంగా పుష్కర ఘాట్లలో ప్రత్యేకంగా పోలీసు కంట్రోల్ రూములు, పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేయడంపై డీజీపీ అనురాగ్‌శర్మను మంత్రులు ఆదేశించారు.

-కేంద్ర సాయం కోరుతాం
రాష్ట్రంలో 70శాతం మేరకు గోదావరి నది ప్రవహిస్తుందని, అందుకే ఇక్కడ ప్రతిష్ఠాత్మకంగా పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని క్యాబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. సబ్‌కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలో పుష్కరాల నిర్వహణలో వివక్ష చూపారని, స్వీయ అస్థిత్వ పాలనలో ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా నిధులు కేటాయించిందని, ఇంకా అవసరం ఉన్నందున ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కోరతామన్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. ఐదు జిల్లాల పరిధిలో నిర్వహించే ఈ పుష్కరాలకు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించనున్నట్లు తెలిపారు.

దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. తెలంగాణలో చేపట్టే ఈ కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులను, అందరు మఠాధిపతులు, పీఠాధిపతులను ఆహ్వానిస్తామని చెప్పారు. దీనికోసం ప్రత్యేకంగా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భద్రతాపరమైన అన్ని చర్యలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నామని, పూర్తి వివరాలను అందులో వీక్షించొచ్చునన్నారు.