క్రీడాకారుల ప్రోత్సాహంలో ముందుంటాం

-క్రీడారంగం అభివృద్ధికి భారీగా నిధులు
-అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, డిఫ్యూటీ సీఎం రాజయ్య
-అంబటి రాయుడు, సైనా, శ్రీకాంత్‌కు సభ అభినందనలు

KTR 01
క్రీడాకారులకు ప్రోత్సాహం అందించే విషయంలో రాష్ట్రం ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ర్టాల కంటే ముందుంటుందని పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కే తారాకరామారావు చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం పద్దులపై చర్చ సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ జోక్యం చేసుకుని ఇటీవల చైనా సూపర్ ఛాంపియన్ షిప్ టైటిళ్లు గెలిచిన సైనా, శ్రీకాంత్‌లను సభ అభినందిస్తే బాగుంటుందన్నారు ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ సభలో చర్చను ప్రతిపాదించారు.
బీజేపీ శాసనసభ పక్ష నేత లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి సరైన రీతిలో ప్రోత్సహించాలని కోరారు. సీపీఐ నేత రవీంద్రకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్రీడాకారులను చక్కగా ప్రోత్సహిస్తున్నారని, ఇది ఇలాగే కొనసాగించాలని కోరారు. బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ మిగిలిన ఆటలకు లభిస్తున్న ప్రోత్సాహం మార్షల్ ఆర్ట్స్‌కు దక్కడం లేదన్నారు. అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రభుత్వం అంబటి రాయుడు, సైనా, శ్రీకాంత్‌లాంటి క్రీడాకారులను సత్కరించడం మరిచిపోయిందన్నారు.

టీఆర్‌ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజ్ మాట్లాడుతూ కరాటేకు తగిన గుర్తింపు లేదని, కేవలం తైక్వాండోకి మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా పేరుందన్నారు. మిగిలిన మార్షల్ ఆర్ట్స్‌ను కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. బీజేపీ సభ్యుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని స్టేడియాల్లో మౌలిక వసతులు కల్పించి, చాలీచాలని జీతాలకు పని చేస్తున్న శిక్షకులకు జీతాలు పెంచాలని కోరారు.

క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: డిప్యూటీ సీఎం రాజయ్య
క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్ధేశంతోనే ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.160 కోట్లు కేటాయించిందని డిప్యూటీ సీఎం రాజయ్య సభలో సమాధానం చెప్పారు.స్టేడియాల నిర్మాణానికి రూ.90 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 107 స్టేడియాలలో పనులు నత్తనడక సాగుతున్నాయని, అందులో కొత్తవి 61 ఉండగా, మరమ్మతులు జరుగుతున్నవి 46 ఉన్నాయన్నారు. అన్ని మండల కేంద్రాల్లో రూ.80 లక్షలతో ఒక ఇండోర్ స్టేడియం, రూ.80 లక్షలతో ఒక అవుట్‌డోర్ స్టేడియాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

5-6 ఎకరాల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చే చోట వీటిని నిర్మిస్తామన్నారు. ఇటీవలే ఎవరెస్టును అధిరోహించిన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు పూర్ణా, ఆనంద్‌లను ప్రభుత్వం రూ.25 లక్షల నజరానాలు ఇచ్చి ప్రోత్సహించిందన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి వన్నె తెచ్చిన క్రీడాకారులను ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. వివిధ క్రీడల్లో ఇటీవల రాణించిన అంబటి రాయుడు, శ్రీకాంత్, సైనాలను ప్రభుత్వం మనస్ఫూర్తిగా అభినందిస్తుందంటూ తీర్మానం ప్రవేశపెట్టగా, సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.