కొత్త చెరువుల తవ్వకం

-అనువైనచోట్ల ఇక జలసిరి గలగలలు
-తొలిసారిగా కొత్త చెరువుల నిర్మాణం దిశగా సర్కారు అడుగులు
-మిషన్ కాకతీయ నాలుగోదశ కింద ఉమ్మడి ఆదిలాబాద్‌లో శ్రీకారం
-రూ.92 కోట్లతో 26 చెరువులకు భూసేకరణ

కాకతీయులు.. రెడ్డి రాజులు.. అసఫ్‌జాహీ వంశస్థులు తెలంగాణలో చెరువుల నిర్మాణం చేపట్టారు. ఇది చరిత్ర. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెరువులు తవ్వించెను.. చెట్లు నాటించెను.. జల సమృద్ధి కోసం ఎన్నో పనులు చేపట్టెను అని చెప్పుకొంటారేమో. ఎందుకంటే పాత చెరువులకు కొత్త కళను తెచ్చే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త చెరువులకూ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు. బీళ్లకు నీళ్లు మళ్లించే కొత్త శకానికి నాంది పలుకుతున్నారు. నీటి సందడి ఎరుగని నేలలకు జలకళ తెచ్చేందుకు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి పాలనలో ధ్వంసమైన చెరువులకు ప్రభుత్వం కొత్త ఊపిరులూదుతున్న సంగతి తెలిసిందే. ఇలా పాత చెరువులకు పునరుజ్జీవం కల్పించడమే కాకుండా అనువైన, అవసరమైనచోట కొత్త చెరువుల నిర్మాణానికీ శ్రీకారం చుట్టింది. భౌగోళికంగా అనుకూలత, అవసరమైన మేర నీటి లభ్యత ఉన్నచోట ప్రజలకు జలసిరి సమకూర్చేందుకు నడుం బిగించింది. ఉమ్మడి ఆదిలాబాద్ వేదికగా రాష్ట్రంలో తొలిసారి 26 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మిషన్ కాకతీయ నాలుగో దశ కింద చేపట్టనున్న ఈ పనులకుగాను స్టేజ్-1లో భూసేకరణకు అవసరమయ్యే రూ.92 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భూసేకరణతోపాటుగా చట్టపరమైన ఇతర పనులను పూర్తిచేసేందుకు ఈ నిధులను వెచ్చిస్తారు.

కొత్త చెరువుల కింద సాగులోకి 25,000ఎకరాలు
-2747 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం చెరువులు
-1275 మిషన్ కాకతీయ మూడు దశల్లో పునరుద్ధరించినవి
-378 నాలుగో దశలో పునరుద్ధరణకు ఎంపిక చేసినవి ఇందులో

41 కొత్త చెరువులు,3 ఆనకట్టల నిర్మాణ పనులకు ప్రతిపాదనలు
పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలో..
-తాంసి, బోథ్, ఖానాపూర్, వాంకిడి, ఆదిలాబాద్, నేరడిగొండ, తలమడుగు, జైనూరు, ఆసిఫాబాద్ మండలాల్లో ఒకటి చొప్పున
-ఇచ్చోడ, గుడిహత్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో మూడు చొప్పున
-కడెం, కెరమెరి మండలాల్లో రెండు చొప్పున కొత్త చెరువుల నిర్మాణం

మొదటిదశ పనులు పూర్తయిన తర్వాత చెరువుల నిర్మాణ పనుల కోసం అంచనాలను సమర్పించాలని ప్రభుత్వం మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్‌ను ఆదేశించింది. రెండోదశ పనుల ప్రతిపాదనలతో పాటు మొదటిదశ కోసం మంజూరైన నిధుల వినియోగ పత్రాలను కూడా జతచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లోపేర్కొంది. పాత ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని.. తాంసి, బోథ్, ఖానాపూర్, వాంకిడి, ఆదిలాబాద్, నేరడిగొండ, తలమడుగు, జైనూరు, ఆసిఫాబాద్ మండలాల్లో ఒకటి చొప్పున, ఇచ్చోడ, గుడిహత్నూరు, ఇంద్రవెల్లి, నార్నూర్ మండలాల్లో మూడు చొప్పున… కడెం, కెరమెరి మండలాల్లో రెండు చొప్పున కొత్త చెరువుల నిర్మాణం జరుగనున్నది. నియోజకవర్గాలవారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్ నియోజకవర్గం-5, బోథ్-10, ఖానాపూర్-6, ఆసిఫాబాద్-6 కొత్త చెరువుల నిర్మాణం జరుగనున్నది. ఈ కొత్త చెరువుల కింద 25 వేల ఎకరాలు కొత్తగా సాగులోకి రానున్నాయి.

సుమారు 1.90 లక్షల ఎకరాలకు జీవం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2747 చెరువులు ఉండగా.. మిషన్ కాకతీయ మూడు దశల కింద 1275 చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. మిగిలిన 1472 చెరువుల్లో నాలుగోదశ కింద 378 చెరువులను ఎంపిక చేశారు. ఇందులో 41 కొత్త చెరువులు, మూడు ఆనకట్టల నిర్మాణ పనులకు కూడా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో భాగంగా మండలిలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి హరీశ్‌రావు కొత్త చెరువుల నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన హామీ ఇప్పుడు పాక్షికంగా నెరవేరినట్టయింది. మిగతా చెరువులకు కూడా త్వరలో అనుమతి లభించే అవకాశమున్నది. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులపై మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపి రూ.80 కోట్ల వ్యయంతో పనులను చేపట్టారు. ఈ నేపథ్యంలో గడిచిన మూడేండ్లలో జరిగిన పనుల ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిన్న నీటివనరుల కింద 59,840 ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చిందని, 1.30 లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగిందని మైనర్ ఇరిగేషన్ సీఈ తెలిపారు.

త్వరితగతిన భూసేకరణ: మంత్రి హరీశ్‌రావు
26 కొత్త చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇంజినీర్లను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఆదిలాబాద్‌లో జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి అనుమతి మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. జిల్లాలో నీటి వనరులు దండిగా ఉన్నప్పటికీ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో వెనుకబడి పోయిందని హరీశ్‌రావు చెప్పారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.