కొలువుతీరిన తెలంగాణ తొలి కేబినెట్

ముఖ్యమంత్రి : కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
జూన్ 2, 2014: తెలంగాణ తొలి సీఎంగా ప్రమాణం
జననం: 17 ఫిబ్రవరి 1954, చింతమడక, సిద్ధిపేట (మండలం), మెదక్ (జిల్లా)
విద్య: ఎంఏ తెలుగు- ఆర్ట్స్ కాలేజీ-ఓయూ రాజకీయ ప్రస్థానం
1970: మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్‌లోకి..
1983: తెలుగుదేశం పార్టీలో చేరిక
1985-1999: నాలుగుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలుపు
1987-88: ఎన్టీఆర్ హయాంలో రాష్ట్ర మంత్రిగా..
1997-99: చంద్రబాబు హయాంలో రాష్ట్ర మంత్రిగా..
1999-2001: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా..
2001 ఏప్రిల్ 27: డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా
2001 ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) స్థాపన
2004: కరీంనగర్ లోక్‌సభ సభ్యుడిగా గెలుపు.. 2004-06: కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా..
2006 సెప్టెంబర్ 23: లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా
2006 డిసెంబర్ 7: ఉప ఎన్నికల్లో మళ్లీ ఎంపీగా గెలుపు
2009: మహబూబ్‌నగర్ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
2014: మెదక్ లోక్‌సభ సభ్యుడిగా, గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపు
2014: సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను 63 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు.. 17 లోక్‌సభ స్థానాలకు గాను 11 స్థానాల్లో టీఆర్‌ఎస్ విజయం.

KCR 011

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా సోమవారం బాధ్యలు చేపట్టిన టీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ పోరాటయోధుడు కే చంద్రశేఖర్‌రావుది ఆది నుంచీ ధిక్కార స్వరమే. పరపీడనకు ఎదురునిలిచి తన ప్రజల దాస్య శృంఖలాలను తెంచిన ఆయన ఓ మారుమూల గ్రామంలో పుట్టిన సామాన్యుడంటే నమ్మటం కష్టమే. మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడక కేసీఆర్ స్వగ్రామం.1954 ఫిబ్రవరి 17న ఆయన జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ తెలుగు లీటరేచర్ చేశారు. 1970లో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఆయన రాజకీయాల్లో అరంగేట్రం చేశారు. 1985లో కేసీఆర్ సిద్దిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటినుంచి ఓటమి ఎరుగకుండా అప్రతిహాతంగా విజయపరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

1987-88లో ఎన్టీఆర్ ప్రభుత్వంలో, 1997-99లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలను నిర్వహించారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001లో డిప్యూటీ స్పీకర్ పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసి అదే ఏడాది ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. 2004లో కరీంనగర్ ఎంపీగా దాదాపు రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.

ఉప ముఖ్యమంత్రులు..

Mahamud Ali

మహ్మద్ మహమూద్ అలీ: హైదరాబాద్ పాతబస్తీ ఆజంపురాకు చెందిన మహ్మద్ మహమూద్ అలీ బీకాం చదివారు. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, టీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఈయనకు కేసీఆర్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాతోపాటు కీలకమైన రెవెన్యూ, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, అర్బన్‌ల్యాండ్ సీలింగ్, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖలు దక్కాయి. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలున్నారు.

Tatikonda Rajaiahడాక్టర్ తాటికొండరాజయ్య: స్వయంగా డాక్టర్ అయిన తాటికొండ రాజయ్యకు కేసీఆర్ క్యాబినెట్‌లో డిప్యూటీ సీఎం హోదాతోపాటు వైద్య, ఆరోగ్యశాఖలు దక్కాయి. 2009లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎంపికైన రాజయ్య 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో స్టేషన్ ఘనపూర్ నుంచి మాజీ మంత్రి విజయరామారావుపై గెలుపొందారు. ప్రజాప్రతినిధిగా కొనసాగుతూనే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ డాక్టర్ల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. 1960 మార్చి 2న జన్మించారు. రాజయ్యకు భార్య, ఇద్దరు కుమారులు. కుమారులిద్దరూ డాక్టర్లే.

మంత్రులు..
Padma Raoటీ పద్మారావు: సిక్రిందాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన టీ పద్మారావు 1954 ఏప్రిల్ 7వ తేదీన జన్మించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న పద్మారావు కేసీఆర్‌కు సన్నిహితుడు. 2004లో కూడా సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆబ్కారీ శాఖ దక్కింది. ఈయనకు భార్య, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

 

Naini Narsimha Reddyనాయిని నర్సింహ్మారెడ్డి: హైదరాబాద్‌కు చెందిన నాయిని నరసింహ్మారెడ్డి కార్మిక నాయకుడిగా అందరికీ సుపరిచుతులు. ప్రస్తుతం ఆయనకు చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకున్నా ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. కీలకమైన హోంశాఖతో పాటు జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్,కార్మిక ఉపాధిశాఖల బాధ్యతలను అప్పగించారు. ఈయనకు ఒక కూతురు, ఒక కుమారుడున్నారు.

 

Etela Rajendarఈటెల రాజేందర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి గెలుపొందిన ఈటెల రాజేందర్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. వైఎస్ హయాంలో టీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా ఉన్న ఈటెల తన వాగ్ధ్దాటితో అందరిని ఆకట్టుకున్నారు. 1964 మార్చి 20వ తేదీన జన్మించిన ఈటెల బీఎస్సీ చదివారు. ఈయనకు భార్య, ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కేసీఆర్ మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళికశాఖ, చిన్నమొత్తాల పొదుపు, రాష్ట్ర లాటరీలు, పౌరసరఫరాలు, తూనికలు కొలతలు, వినియోగదారుల వ్యవహారాల శాఖలబాధ్యతలు దక్కాయి.

Jogu Ramanna

జోగురామన్న: ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. టీడీపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన రామన్న సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు అన్ని పదవులను నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కేసీఆర్ క్యాబినెట్‌లో అడవులు, పర్యావరణ మంత్రిత్వశాఖల బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియేట్ వరకు చదివారు. 1961 జులై 4వ తేదీన జన్మించిన రామన్నకు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Jagadeeshwar Reddy

జీ జగదీశ్‌రెడ్డి : నల్లగొండ జిల్లా సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, అధికారప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. 1965 జూలై 18న జన్మించిన ఈయన కేసీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ దక్కింది. జగదీశ్‌రెడ్డికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

KT Ramarao

కల్వకుంట్ల తారకరామారావు: సిరిసిల్లా ఎమ్మెల్యేగా గెలుపొందిన కల్వకుంట్ల తారకరామారావు ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు. 1976 జూలై 24న జన్మించిన కేటీఆర్ ఎంబీఏ విద్యనభ్యసించారు. కొన్నాళ్లపాటు అమెరికాలో ఉద్యోగం చేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖలను నిర్వహించనున్నారు. కేటీఆర్‌కు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

Pocharam Srinivas Reddy

పోచారం శ్రీనివాస్‌రెడ్డి: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో టీడీపీ హయాంలో పంచాయతీరాజ్, గృహనిర్మాణం, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణపై బాబు రెండు కళ్ల సిద్ధాంతం నచ్చక టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 1949 ఫిబ్రవరి 10న జన్మించిన శ్రీనివాసరెడ్డికి కేసీఆర్ క్యాబినెట్‌లో వ్యవసాయం, ఉద్యానవనాలు, పట్టుపరిశ్రమ, పశు సంవర్దకం, మత్య్స, డైరీ డెవలప్‌మెంట్, సీడ్ డెవలప్‌మెంట్ శాఖలు దక్కాయి. ఈయనకు భార్య, ముగ్గురు కుమారులు.

Harish Rao

తన్నీరు హరీశ్‌రావు: మెదక్ జిల్లా సిద్ధిపేట నుంచి గెలుపొందిన హరీశ్‌రావు గతంలో వైఎస్ ప్రభుత్వంలో యువజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. టీఆర్‌ఎస్‌లో మంచివక్తగా పేరొందిన హరీశ్ తెలంగాణ ప్రజల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తారు. 1971 జూన్ 3వ తేదీన జన్మించిన హరీశ్‌రావు డిగ్రీ పూర్తిచేశారు. కేసీఆర్ మంత్రివర్గంలో భారీ నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలను నిర్వహించనున్నారు. ఈయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు.

Patnam Mahendar Reddy

డాక్టర్ పీ మహేందర్‌రెడ్డి: కేసీఆర్ క్యాబినెట్‌లో రవాణాశాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్న తాండూరు ఎమ్మెల్యే పీ మహేందర్ రెడ్డి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1963 సెప్టెంబర్ 23న జన్మించిన మహేందర్ రెడ్డి రాజేంద్రనగర్ అగ్రికల్చర్ వర్సిటీ నుంచి వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పొందారు. 1994లో తొలిసారిగా టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009, 2014లోనూ తాండూరు నుంచే గెలుపొందారు. మహేందర్ రెడ్డి భార్య సునీత సైతం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా చైర్‌పర్సన్‌గా ఆమె వ్యవహరించారు. ప్రస్తుత యాలాల జడ్పీటీసీగా ఉన్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.