కోదాడ నుంచే తెరాస ఎన్నికల విజయ యాత్ర

-‘పిల్లి తీర్థయాత్ర’లా కాంగ్రెస్‌ నేతల బస్సు యాత్ర
-‘కోదాడ ప్రగతి సభ’లో మంత్రి శ్రీ కెటి రామారావు

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతిగా నిలిచారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి శ్రీ కెటి రామారావు పేర్కొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కోదాడ బాలాజీనగర్‌లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరించి భూమి పూజ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రగతి సభలో మాట్లాడారు. అభివృద్ధిని మెచ్చుకోవాల్సిన ప్రతిపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నాయకులకు ఏంమాట్లాడాలో తెలియడం లేదని దుయ్యబట్టారు. వంద ఎలుకలను తిన్న పిల్లి తీర్థ యాత్రలకు బయలుదేరిన విధంగా కాంగ్రెస్‌ నాయకుల బస్సు యాత్ర ఉందని ఎద్దేవా చేశారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గం నుంచి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పలుమార్లు మంత్రిగా సేవలందించిన జానారెడ్డి జిల్లాకు చేసిన మేలేమిటని ప్రశ్నించారు. కోదాడ తెలంగాణకు ముఖద్వారంగా ఉంటుందని.. 2019 ఎన్నికలవిజయయాత్రను ఇక్కడి నుంచే ప్రారంభిస్తామన్నారు. అడ్డంకులెన్ని సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామని స్పష్టంచేశారు.