కేజీ టు పీజీకి కట్టుబడి ఉన్నాం

– ప్రభుత్వ పాఠశాలలకు వైభవం తెస్తాం
– పీఆర్‌టీయూటీఎస్ విద్యా సదస్సులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
– దేశానికి విజ్ఞానం, విద్య కావాలి: ఆర్థిక మంత్రి ఈటెల

Mahmood Ali

కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య పథకానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారుల పిల్లలను కూడా ప్రభుత్వ బడులలో చదివించేలా కృషి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య పటిష్ఠతలో ఉపాధ్యాయుల పాత్ర అనే అంశంపై సోమవారం పీఆర్‌టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సీమాంధ్రుల పాలనలో కార్పొరేట్, ప్రైవేటు విద్యా విధానాన్ని తీసుకువచ్చి దోపిడీ చేశారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు విద్య అందించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు.

దేశానికి విజ్ఞానం, విద్య అవసరం: ఆర్థిక మంత్రి ఈటెల
దేశానికి తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డుల కన్నా విజ్ఞానం, విద్య అందించడం ఎంతో అవసరమని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్య అందించేందుకు సీఎం కేసీఆర్ కట్టుబడి ఉన్నారన్నారు. విద్యాభివృద్ధి కోసం కేంద్రం సెస్సు రూపంలో రాష్ర్టాలకు వేల కోట్లు నిధులు ఇస్తున్నా వాటిని సద్వినియోగపరచడంతో గత ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని ఆయన దుయ్యబట్టారు. మధ్యాహ్న భోజనం, కంప్యూటర్ విద్య, సాక్షర భారత్, రాజీవ్ విద్యా మిషన్ వంటి పథకాలలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు తన హయాంలో కార్పొరేట్ చదువుల గురించే తప్ప సర్కారీ విద్యను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నవ తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పీఆర్‌టీయూటీఎస్ రాష్ట్ర ఆధ్యక్షుడు పీ వెంకట్‌రెడ్డి అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందుబాటులోకి తీసుకురావడానికి సీఎం సంసిద్ధంగా ఉన్నారన్నారు.

ఈ విషయంలో ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రైవేటు పాఠశాలలను మరిపించే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను తీర్చి దిద్దడానికి ఉపాధ్యాయులంతా ముందుకు రావాలన్నారు. ఆల్ ఇండియా టీచర్స్ ఆర్గనైజేషన్ (ఏఐటీఓ) అధ్యక్షుడు బీ.మోహన్‌రెడ్డి విద్యా శాఖ తయారు చేసే పాఠ్యాంశాలలో ఉపాధ్యాయులను భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ ఎంఎల్‌సీలు కే జనార్ధన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్‌టీయూ ప్రధాన కార్యదర్శి పీ సరోత్తంరెడ్డి పాల్గొన్నారు.