కేజీ టు పీజీ.. కేసీఆర్ కలల ప్రాజెక్టు

-విద్యుత్ కోతల్లేని రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం
-విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడిJagadish Reddy 01
కేజీ టు పీజీ ఉచిత విద్య ముఖ్యమంత్రి కేసీఆర్ కలల ప్రాజెక్టని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో రూ.24కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలోనే కేసీఆర్ కేజీ టు పీజీ ఉచిత విద్య పథకానికి మదిలో రూపకల్పన చేశారన్నారు. పదేండ్లుగా కేసీఆర్ తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా అందించాలనే అంశంపై ఆలోచన చేస్తూనే ఉన్నారన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన విద్యా విధానం ఏ విధంగా ఉండాలి, ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులుగా మన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే కేజీ టు పీజీ విద్య అంశాన్ని ప్రస్తావించిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. సమాజాభివృద్ధి ప్రధానంగా విద్యపైనే ఆధారపడి ఉంటుందని కేసీఆర్ విశ్వసించారని, అందుకే రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే క్రమంలో విద్యకు అధిక ప్రాధాన్యం కల్పిస్తారని తెలిపారు. ప్రస్తుతం 13 విభాగాలుగా ఉన్న ప్రాథమిక, ఉన్నత విద్యను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని చెప్పారు.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి పైలట్ ప్రాజెక్టుగా కేజీ టు పీజీ విద్య ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మూడేండ్లలో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూట 9 గంటలు అందజేస్తామన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు దామరచర్లలో దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటు నిర్మిస్తున్నామన్నారు. 4400 మెగావాట్ల ప్లాంటు నిర్మాణం కోసం రూ.16 వేల కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. నిరుపేదల జీవితాలు గుడుంబాకు బలి కాకూడదనే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఎక్సైజ్ పాలసీని తీసుకొస్తున్నారని చెప్పారు. కార్యక్రమాల్లో ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ నేతలు అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, తేరా చిన్నపరెడ్డి, డీఈవో విశ్వనాథరావు, ఆర్డీవో కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు.