కేంద్రం దృష్టికి ఆంధ్ర కుట్రలు

కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేయడానికి చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నాడని, అందులో భాగంగానే తెలంగాణలో విద్యుత్ సంక్షోభాన్ని సృష్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలచారి ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రు నాయక్‌లతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్‌లతో కూడిన బృందం కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌కె సిన్హా, విద్యుత్ వివాదంపై కేంద్రం నియమించిన కమిటీ చైర్‌పర్సన్ నీరజామాథుర్‌లను కలిసింది.

Vinod Kumar

-తక్షణమే స్పందించాలన్న తెలంగాణ ప్రతినిధి బృందం
-నష్టపోయిన విద్యుత్‌ను కేంద్ర కోటానుంచి ఇవ్వాలి
-ఇంధన కార్యదర్శి, నీరజామాథుర్‌లతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ
-ఏపీ భవన్ ప్రాంగణం మాదే.. ఏపీ మరో చోటు చూసుకోవాలి
-ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేయండి:
-కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు విజ్ఞప్తి
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కుట్రలను కేంద్రం దృష్టికి తెచ్చామని వేణుగోపాలచారి చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజులనుంచే ఏపీ ప్రభుత్వం కుట్రలు ప్రారంభించిందని ఆయన ఆరోపించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ ఉల్లంఘనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకనైనా ఆపకపోతే కేంద్రం తక్షణం తన కోటా నుంచి ఎవరికీ కేటాయించకుండా ఉన్న విద్యుత్ (అన్ అలొకేటెడ్ పవర్)ను తెలంగాణ రాష్ర్టానికి ఇవ్వాలని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్న విద్యుత్‌ను తెలంగాణకు మళ్ళించాలని కోరినట్టు చెప్పారు.

తెలంగాణ బొగ్గును ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న వీటీపీఎస్, ఆర్‌టీపీపీలకు కేటాయిస్తూ ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ను మాత్రం తెలంగాణకు ఇవ్వడం లేదని అన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పవన విద్యుత్ ప్లాంట్లలో, కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలోనూ తెలంగాణ డిస్కంల పెట్టుబడులు ఉన్నాయని అయితే విద్యుత్ మాత్రం రావడం లేదని ఆయన చెప్పారు. నీరజామాథుర్ కమిటీ తుది నివేదికను వెల్లడించకుండా ఏపీ ప్రభుత్వం కమిటీపై ఒత్తిడి తెస్తోందని ఆయన ఆరోపించారు.

ఊహించినదానికన్నా ఎక్కువ అన్యాయం: రామచంద్రు తెజావత్
రాష్ట్రం ఏర్పాటు సందర్భంలోనే విద్యుత్ సమస్యలు ఊహించామని, అయితే పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న మేరకు విద్యుత్ వస్తే ఈ సమస్యను ఒక మేరకు పరిష్కరించుకోవచ్చని భావించామని రామచంద్రు తేజావత్ చెప్పారు. కానీ ఊహించని విధంగా ఏపీ సర్కారు ఉద్దేశ్యపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు.

జూన్ 8 తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిందని, జూన్ 15వ తేదీనే ఏకపక్షంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసుకుందని గుర్తు చేశారు. ఈ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, సదర్న్ లోడ్ డిస్పాచ్ సెంటర్, కేంద్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులరేటరీ కమిషన్ తప్పు పట్టాయని, కొనుగోలు ఒప్పందాల రద్దు చెల్లదని నిర్ణయం ప్రకటించాయని, అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెటిందని అన్నారు.

పార్లమెంటులో లేవనెత్తుతాం: వినోద్‌కుమార్
తెలంగాణలో విద్యుత్ సంక్షోభానికి ముమ్మాటికీ ఏపీ ప్రభుత్వమే కారణమని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. నీరజామాథుర్‌కు తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్నీ, ఆంధ్రప్రదేశ్ చట్ట ఉల్లంఘనలను వివరించామని తెలిపారు. వెంటనే తుది నివేదికను సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఇప్పటికే రెండు రాష్ర్టాలతోనూ రెండుసార్లు అభిప్రాయాలను తెలుసుకున్న నీరజామాథుర్ కమిటీ త్వరలో మరో దఫా సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారన్నారు.

ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ విద్యుత్ సంక్షోభానికి ఏపీ చేస్తున్న కుట్రలు, నీరజామాథుర్ కమిటీ తుది నివేదిక జాప్యం అంశాలను లేవనెత్తుతామని వినోద్ తెలిపారు. నీరజామాథుర్ కమిటీ తుది నివేదికను వెంటనే సమర్పించాల్సిందిగా పార్లమెంటు సాక్షిగా టీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుందని స్పష్టం చేశారు.

ఇంధన కార్యదర్శితో భేటీ..
అంతకుముందు ఇంధన శాఖ కార్యదర్శి ఎస్‌కె సిన్హాతో తెలంగాణ ప్రతినిధి బృందం భేటీ అయింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా తూట్లు పొడుస్తూ ఉందో వివరించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రు నాయక్‌లతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ ఈ సందర్భంగా విడివిడిగా విజ్ఞాపన పత్రాలను అందజేశారు.

జూన్ మొదలు అక్టోబర్ చివరి వరకు మొత్తం సుమారు 573.56 మిలియన్ యూనిట్ల విద్యుత్ రాలేదని బృందం సభ్యులు ఫిర్యాదు చేశారు. దిగువ సీలేరులో ఉత్పత్తి అవుతున్న 460 మెగావాట్లు, డొంకరాయిలో 25 మెగావాట్లు, ఎగువ సీలేరుకు చెందిన 240 మెగావాట్లలో తెలంగాణ వాటా 391 మెగావాట్లు ఇవ్వలేదని వివరించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల అమలు మీద పునర్ వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా పేర్కొన్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవించడం లేదని చెప్పారు.

అలాగే కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం మార్చి 31వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా పని చేస్తున్నా కుట్రపూరితంగా ఇంతవరకూ కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభించడం లేదని , దిగువ-ఎగువ సీలేరు, కృష్ణపట్నం ప్రాజెక్టుల ద్వారా తెలంగాణకు వాటా ప్రకారంరావాల్సిన సుమారు 573.76 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందలేదని తెలిపారు. త్వరలో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్న 1040 మెగావాట్ల సామర్ధ్యమున్న హిందుజా విద్యుత్ ప్లాంటు విషయంలో కూడా తెలంగాణకు ఇదే తరహా అన్యాయం జరిగేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య విద్యుత్ పంపిణీ విషయంలో చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు స్పష్టమవుతున్న నేపథ్యంలో ఈ చట్టాన్ని సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

తుది నివేదికను వెలువరించాలని నీరజామాథుర్ కమిటీకి విజ్ఞప్తి
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య విద్యుత్ పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఛైర్ పర్సన్ నీరజామాథుర్‌తో తెలంగాణ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం భేటీ అయింది. తుది నివేదికను త్వరగా ఇవ్వాలని కోరింది. వీలైనంత త్వరగా కమిటీ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని, ఆలస్యమైనాకొద్దీ రబీ పంట వేసుకోలేని స్థాయిలో రైతులు ఇబ్బందులు పడతారని వివరించారు.

ఏపీ భవన్ ప్రాంగణం మా వారసత్వ సంపద: ప్రస్తుతం ఏపీ భవన్‌గా కొనసాగుతున్న స్థలం నైజాం సంస్థానం నుంచి తెలంగాణకు సంక్రమించిన వారసత్వ సంపద అని టీఆర్‌ఎస్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఏపీ భవన్ ప్రాంగణం తెలంగాణ ప్రజలకు, తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే చెందుతుందని అన్నారు. ఈ ప్రాంగణంలో ఏపీ ప్రభుత్వం భవనాల నిర్మాణం అంగీకారం కాదని స్పష్టం చేశారు. ప్రతి రాష్ర్టానికి భవన్‌ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని ఇస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అలాంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.

హైదరాబాద్ హౌస్‌ను అప్పటి నిజాం ప్రభువులు నిర్మించారని, దాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నందుకుగాను ప్రత్యామ్నాయంగా నష్టపరిహారం కింద ఇచ్చిన స్థలం తెలంగాణకు చెందుతుందని అన్నారు. వేణుగోపాలచారి మాట్లాడుతూ హైదరాబాద్ హౌస్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన స్థలం గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరోక్షంగా ప్రకటనలు చేయడం గందరగోళానికి తెర లేపడమేనన్నారు.

హైదరాబాద్ స్టేట్‌గా కొనసాగిన నైజాం సంస్థానం తెలంగాణ రాష్ర్టానికి చెందుతుందేగానీ ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి భాగస్వామ్యం లేదన్నారు. రామచంద్రు తెజావత్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలోనే రాష్ర్టానికి వెలుపల ఉన్న రాష్ట్ర ఆస్తుల విభజన జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలన్న అంశాన్ని చేర్చేటప్పుడు హైదరాబాద్ హౌస్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ భవన్ ఆస్తుల విభజన జరగరాదన్న అంశాన్ని నొక్కిచెప్పామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టును ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి వెంటనే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడకు తెలంగాణ ప్రతినిధి బృందం విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డాక్టర్ వేణుగోపాలచారి, రామచంద్రు నాయక్‌లతో పాటు టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ మంగళవారం మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు ఉమ్మడి హైకోర్టు కొనసాగడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఏపీకి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సంవత్సరంకల్లా రెండు రాష్ర్టాలకు విడివిడి హైకోర్టులు ఏర్పడాల్సి ఉన్నదని గుర్తు చేశారు.

అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనకు స్వంతంగా హైకోర్టు ఏర్పాటు చేసుకునేంత వరకు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు ఉమ్మడిగానే కొనసాగుతుందని పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31పేర్కొందని, అయితే ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోనందున కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత త్వరగా హైకోర్టు విభజన ప్రక్రియను పూర్తి చేయాలని తెలంగాణ ప్రతినిధి బృందం సమర్పించిన విజ్ఞాపనపత్రంలో పేర్కొంది.

మంత్రి స్పందిస్తూ ఈ ప్రక్రియపై ఇప్పటికే న్యాయశాఖ అధికారులతో మాట్లాడానని, మరో వారం రోజుల్లో మరోమారు సమావేశమై వివరాలను తెలియజేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌లో ఐటీ సంబంధిత ప్రాజెక్టులపై వివరించారు. ఐటీఐఆర్ ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ప్రస్తావించి కేంద్రం సహాయసహకారాలు అందించాలని కోరారు.