కేంద్ర సాయం పెంచండి

తెలంగాణ ధనిక రాష్ట్రమని 14వ ఆర్థిక సంఘం గుర్తించిన నేపథ్యంలో, తమ ప్రభుత్వానికి రుణపరపతిని పెంచుకునేలా కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నీతిఆయోగ్ ప్రతినిధులను కోరారు. రాష్ర్టానికి కేంద్రంనుంచి అందే సాయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ ప్రతినిధులు వీకే సారస్వత్, అశోక్‌జైన్‌లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

CM KCR met with Neethi Aayog memebers

-తెలంగాణ ధనిక రాష్ట్రమని ఆర్థిక సంఘం గుర్తించింది
-ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు సరళం చేయండి
-రుణపరపతి పెంచుకునేందుకు సహకరించండి
-కేంద్ర పథకాలకు తగిన నిధులు రావడం లేదు
-నీతి ఆయోగ్ ప్రతినిధులతో సీఎం కేసీఆర్
విత్త క్రమశిక్షణ, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) మార్గదర్శకాల ప్రకారం రుణసహాయాన్ని పొందడానికి తమ రాష్ర్టానికి వీలు కలుగుతుందని సీఎం వారి దృష్టికి తెచ్చారు. రెవెన్యూ మిగులు ఉన్న రాష్ర్టాలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని అన్నారు. తెలంగాణ మిగులు ఆదాయం కలిగిన రాష్ట్రమైనందున కేంద్రంతో సమానంగా రుణం తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ వంటి ప్రతిష్ఠాత్మక పథకాలు చేపట్టిందని, వీటికి నిధుల ఆవశ్యకత ఉందని తెలిపారు.

ఎఫ్‌ఆర్‌బీఎంను సరళీకరిస్తే ఈ ప్రాజెక్టులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. రాష్ర్టాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులలో కోత విధించిన విషయాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. కేంద్ర పథకాలకూ తగిన స్థాయిలో నిధులు రావడం లేదని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు బీవీ పాపారావు, జీఆర్ రెడ్డి, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ప్రణాళికామండలి వైస్ చైర్మన్ ఎస్ నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్‌రావు, ప్రణాళిక విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ బీపీ ఆచార్య, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు ప్రణాళిక, ఆర్థికశాఖ, నీటిపారుదలశాఖ అధికారులతో నీతి ఆయోగ్ ప్రతినిధులు వేర్వేరుగా సమావేశమయ్యారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి కేంద్రం ఇతోధికంగా ఆర్థిక సాయమందించాలని ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు నిరంజన్‌రెడ్డి నీతి ఆయోగ్ ప్రతినిధులను కోరారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు పునర్విభజన చట్టాన్ని అనుసరించి ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదులున్నా నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉందని, దీంతో తెలంగాణ ఆవిర్భవించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిందని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి తెలిపారు. కాకతీయులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు వారి పరిపాలనలో చెరువులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, ఇదే తీరుగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు.

తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, భూములు, వ్యవసాయం, అక్షరాస్యత, ఆరోగ్యసూచి, రాష్ట్ర స్థూల ఉత్పత్తితోపాటు ఇతర ముఖ్యమైన సూచికలపై ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య నీతి ఆయోగ్ ప్రతినిధులకు వివరించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి నాలుగేండ్లలో తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేయనున్నదని వివరించారు. రూ.35,800 కోట్ల ప్రాథమిక అంచనాలతో ఈ పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన 40 టీఎంసీల నీటిని కృష్ణా, గోదావరి నదులనుంచి తీసుకుంటున్నామని వివరించారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, వ్యర్థాల సేకరణ, స్వచ్ఛభారత్ తదితర అంశాలపై సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి వివరించారు.

పారిశుద్ధ్యంపై ప్రజలకు వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. విద్యారంగానికి కేంద్రంనుంచి వివిధ పథకాలకింద వచ్చే నిధులను కోత లేకుండా విడుదల చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ ఆచార్య కోరారు. రాష్ట్రంలో అక్షరాస్యత 66.46 శాతం ఉందన్నారు.మహబూబ్‌నగర్‌ లాంటి జిల్లాల్లో నిరంతర వలసల కారణంగా అక్షరాస్యత తక్కువగా ఉందని వివరించారు. రాష్ట్రంలో నూరుశాతం విద్యార్థుల నమోదు ఉందని, పాఠశాలల్లో తాగునీరు, ప్రహరీల కొరత ఉందన్నారు. పాఠశాలల్లో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో మరుగుదొడ్లు నిర్మించే కార్యక్రమాన్ని వివిధ సంస్థలు, బ్యాంకుల సహకారంతో చేపట్టామని వివరించారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. వైద్యరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ చంద వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ దవాఖానల స్థాయి, మాతాశిశుమరణాలు, వివిధ వర్గాలకు అందిస్తున్న ఆరోగ్యసేవలు, జాతీయ ఆరోగ్యమిషన్, ఆరోగ్యశాఖ గురించి వివరించారు. ప్రతి నియోజకవర్గంలో వంద, జిల్లా కేంద్రంలో వేయి పడకలకు వైద్యశాలల స్థాయిని పెంచాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఉస్మానియా దవాఖానలో పడకలను 2500కు, గాంధీ దవాఖానలో రెండువేలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నాయని ప్రతినిధులకు వివరించారు.