కేంద్రంతో యుద్ధాన్ని కోరడం లేదు!

– ప్రజలెన్నుకున్న ప్రభుత్వంపై కేంద్రం తీరు బాధాకరం
– లేఖ వాపస్‌తీసుకోకుంటే ఇతర మార్గాలు తప్పవు
– పీటీఐతో ఐటీ, పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి తారకరామారావు

KTR

తమ ప్రభుత్వం కేంద్రంతో యుద్ధాన్ని కోరుకోవడంలేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ఒకవేళ హోంశాఖ తన లేఖను ఉపసంహరించుకోకపోతే మాత్రం ఇతర మార్గాలు, ఉపాయాలను అనుసరించాల్సి వస్తుందని అన్నారు. ఆదివారం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. ఆ ఉపాయాలు ఏమిటనేవి రానున్న రోజుల్లో తెలుస్తుందన్నారు.

హోం శాఖ ఈనెల 8న పంపిన లేఖ ద్వారా కేంద్రం తన అభిప్రాయాలు, నిర్ణయాలను తెలంగాణపై రుద్దేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ నేపథ్యంలో తమకు వేరే మార్గం లేకుండా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రజల చేత ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వ హక్కులను కాలరాసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అంశమైన శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించి సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించాలని చూస్తుందన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖలో హోంశాఖ పంపిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరారన్నారు. ప్రధాని నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏపీ పునర్విభజన చట్టం ఈ ఏడాది ఫిబ్రవరి 18న పాస్‌కాగా జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పటివరకు ఎక్కడా చిన్న సంఘటన కూడా జరగలేదన్నారు. అయినప్పటికీ కేంద్రానికి లేఖ పంపాల్సినంత అత్యవసర పరిస్థితి ఏమొచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణ, మెరుగైన సెక్యూరిటీ ప్రమాణాల కోసం ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా నిధులు వెచ్చించిందన్నారు. కేంద్ర హోంశాఖ లేఖ ప్రధాని మోడీకి తెలియకుండానే రావచ్చని, ఇందుకు కూడా అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.