కేసీఆర్ పనితీరు భేష్!

తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావు విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంసించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకుంటున్న ముందస్తు చర్యలు, పనితీరు భేష్ అని ప్రశంసల జల్లు కురిపించారు. శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్‌తో రమణ్‌సింగ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రమణ్‌సింగ్ మాట్లాడుతూ అత్యంత గడ్డు పరిస్థితి నుంచి కోతలు లేని విద్యుత్ సరఫరాచేసే స్థితికి తెలంగాణ చేరుకోవడం మామూలు విషయం కాదన్నారు.

KCR with Chattisgarh CM Raman singh

తాను హైదరాబాద్‌లో దిగగానే కారెక్కానని, కారు డ్రైవర్‌ను రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఏమిటని ఆరా తీశానని, తమ రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ కోతలు లేవని ఆ డ్రైవర్ చెప్పాడని రమణ్‌సింగ్‌ తెలిపారు. ఇంతకుముందు కరెంట్‌కు చాలా కష్టముండేదని, కేసీఆర్ సీఎం అయ్యాక కరెంట్ కష్టాలు పోయాయని ఆ డ్రైవర్ చెప్పడంతో తాను చాలా సంతోషపడ్డానని రమణ్ సింగ్ వివరించారు. రోజుకు సగటున ఆరువేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే తెలంగాణలో కోతలు లేని విద్యుత్ సరఫరా మామూలు విషయం కాదన్నారు.

-ప్రణాళికాబద్ధంగా కరెంట్ కష్టాలు అధిగమించారు
-ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ ప్రశంస
-ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ మధ్య విద్యుత్ లైన్ నిర్మాణంపై ఫోకస్
తెలంగాణ ఏర్పడిన వెంటనే విద్యుత్ కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కేసీఆర్‌ను కలవగానే ముందు విద్యుత్ అంశమే ప్రస్తావించారు. భవిష్యత్ విద్యుత్ ఉత్పత్తి ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. జల, సౌర విద్యుత్ ఉత్పత్తి, భవిష్య ప్రణాళికలపై ఆరా తీశారు. రాష్ట్రంలో 2700 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇంతకుముందు చేసుకున్న ఒప్పందం మేరకు ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు అవసరమైన లైన్ నిర్మాణ పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. రెండు రాష్ర్టాల్లోని ప్రజా పంపిణీ వ్యవస్థ, తదితర అంశాలపై చర్చ జరిగింది. చత్తీస్‌గఢ్‌లో నయా రాయ్‌పూర్ నిర్మాణ పురోగతిపై కేసీఆర్.. రమణ్‌సింగ్‌తో ఆరా తీశారు. మీరు బాగా చేస్తున్నారు. మీది రిచ్ స్టేట్ కూడా, మీలాగే మేము కూడా భవిష్యత్‌లో తయారవుతాం.

KCR with Chattisgarh CM Raman singh01

మంచి కార్యక్రమాలు అమలుచేస్తాం అని రమణ్‌సింగ్ చెప్పారు. సీఎం కేసీఆర్.. రమణ్‌సింగ్‌కు శాలువా కప్పి చార్మినార్ జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కే తారకరామారావు, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్‌రెడ్డి, లకా్ష్మరెడ్డి, డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్ వేణుగోపాలాచారి, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ రవీందర్‌రావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.