కేసీఆర్ పాలనాదక్షుడు..

-శాంతిభద్రతలు ఆయన పాలనాదక్షతకు నిదర్శనం
-అపోహలు సృష్టించినవాళ్ల నోళ్లు మూయించాం
– గ్రేటర్‌పై గులాబీ జెండా ఎగురడం ఖాయం
– నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో మంత్రి తుమ్మల

Tummala Nageshwar Rao

హైదరాబాద్ మినీ భారతదేశం..ఇక్కడ ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. రాజధానిలో అన్ని రకాల పండుగలను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకొనేలా చర్యలు తీసుకొంటున్నది. నగరాన్ని ఆదర్శంగా అందరు ప్రశాంతంగా నివసించే విశ్వనగరంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నాం. గ్రేటర్‌లో ఉంటున్న ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి గర్వంగా చెప్పుకొనేలా చేస్తున్నాం అని రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

తెలంగాణ వస్తే హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్యలు వస్తాయని అపోహలు సృష్టించిన వాళ్ల నోళ్లు మూయించామని, ఈ 18 నెలల కాలంలో ఒక్కరి మీద కూడా ఈగ వాలకుండా చూసామని చెప్పారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చిన ప్రజలు, అన్ని కులాలు, మతాలకు చెందినవారు ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే అది కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సమర్థవంతమైన పోలీస్ వ్యవస్థ కోసం రూ.700 కోట్లు కేటాయించిన సంగతి ఆయన గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన బ్రిటన్, ఆమెరికా నగరాల సరసన హైదరాబాద్‌ను నిలుపడానికి ఇక్కడ అత్యంత ఆధునిక వ్యవస్థలతో కూడిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను నిర్మిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా రూ.25 వేల కోట్లతో ఎస్‌ఆర్‌డీపీ పథకం, 125 గజాలలోపు స్థలం ఉన్నవారికి ఇండ్ల పట్టాలు, స్లమ్ ఫ్రీ సిటీ కోసం డబుల్ బెడ్‌రూం ఇండ్లు ఉచితంగా ఇవ్వడం వంటి పథకాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. కరెంట్ సమస్యను ఏడాదిలోపే అధిగమించడం, ఐటీ హబ్, నగరానికి రెండు అదనపు భారీ రిజర్వాయర్ల నిర్మాణం, కరువును ముందే గుర్తించి సకాలంలో గోదావరి, కృష్ణా జలాలు నగరానికి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు ప్రజల ప్రశంసలు పొందుతున్నాయన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కూకట్‌పల్లి నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ పరిశీలకులుగా వ్యవహరిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఎన్నికల్లో బల్దియాపై గులాబీ జెండా ఎగురడం ఖాయమన్నారు. ఆయనతో ఇంటర్వ్యూ విశేషాలు..

గ్రేటర్ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటి?
అన్ని విషయాల్లో అన్ని వర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. మైనార్టీలు, గిరిజనులు, దళితులు, పేద వర్గాలతోపాటు అగ్రవర్ణాల్లోఉన్న పేదవాళ్లకు కూడా సమన్యాయం చేయాలని సీఏం కేసీఆర్ సంకల్పించారు.

మ్యానిఫెస్టో ఎలా ఉండబోతున్నది?
హైదరాబాద్‌లో నివసించే ప్రజలు కోరుకుంటున్న విధంగా మా ఎన్నికల ప్రణాళిక ఉంటుంది. ప్రజల కోసమే ప్రణాళిక తప్ప ఓట్ల్ల కోసం కాదు. ప్రతిపక్షాల్లాగా ఓట్ల కోసం మాయమాటలు చెప్పి, ప్రలోభపెట్టే అవసరం మాకు లేదు. మేం చేసింది చెబుతున్నాం. ఇంతకుముందున్న ప్రభుత్వాలు బుల్డోజర్లు పెట్టి పేదల గుడిసెలు కూలగొడితే, మేం వారికి డబుల్ బెడ్ రూంలతో పక్కా ఇండ్లు కట్టించి ఉచితంగా ఇస్తున్నాం.

ప్రచార సరళి , ప్రజల స్పందన ఎలా ఉన్నది?
సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు ఇచ్చిన ప్రాధాన్యం చూసి అన్ని వర్గాల ప్రజలు మాది హైదరాబాద్ అని గర్వంగా చెప్త్తున్నారు. 60 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వానికి లేని ఆదరణను మేం పొందుతున్నాం.

కోర్ సిటీలో, శివార్లలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు?
నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఒకప్పుడు టీఆర్‌ఎస్ బలం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు బలమైన శక్తిగా ఎదిగింది. కేసీఆర్ పరిపాలన దక్షత, అభివృద్ధి కార్యక్రమాలే ఇందుకు కారణం.

ఇతర పార్టీల నేతలను ప్రలోభ పెట్టి చేర్చుకొంటున్నారన్న ఆరోపణలకు మీ సమాధానం?
ఎవరినీ ప్రలోభ పెట్టాల్సిన అవసరం మాకులేదు. వారు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను మా పాలనలో చూస్తున్నారు కాబట్టే స్వచ్ఛందంగా మా పార్టీలోకి వస్తున్నారు?

టీఆర్‌ఎస్‌కే ఎందుకు ఓటు వేయాలి?ప్రజలకు మీ విజ్ఞప్తి ఏమిటి?
న్యాయంగా, ధర్మబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి చేస్తున్నాం. ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క చిన్న తప్పు కూడా తెలిసి చేయలేదు. తెలియక ఏదో ఒక చోట జరిగినా వెంటనే సరిచేసుకునే సామర్థ్యం, సమన్వయం మాకున్నది. తెలంగాణ ప్రజలకు న్యాయం కోసమే రాష్ట్రాన్ని సాధించిన పార్టీ టీఆర్‌ఎస్. ఆ పార్టీ అధినేతే రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టారు. 14 సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకొన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను ప్రజలు సీఏం కేసీఆర్‌పై పెట్టారు. అందుకే ఆయన సర్వశక్తులు ఒడ్డి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమాలను కొనసాగించే బాధ్యతను ప్రజలు ఓటు ద్వారా తీసుకోవాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అడుగుతున్నాం.