కేసీఆర్ మిషన్ చైనా..

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పదిరోజుల చైనా పర్యటన సానుకూల, సుహృద్భావ వాతావరణంలో మొదలైంది. డాలియన్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో పాల్గొనేందుకు చైనా వెళ్లిన కేసీఆర్ ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు నెలకొన్న అనువైన వాతావరణాన్ని ప్రపంచం దృష్టికి తేనున్నారు. ఈ కృషి మొదటిరోజే ఫలించింది. రాష్ట్రంలో వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు లియోగ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంసిద్ధత వ్యక్తంచేసింది. మరోవైపు తమ తమ కంపెనీలను సందర్శించాలని, తెలంగాణ రాష్ట్రంలో అమలుచేస్తున్న నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించాలని అనేక కంపెనీలనుంచి కేసీఆర్ బృందానికి ఆహ్వానాలు అందుతున్నాయి.

KCR met with Industrialists in China
-పర్యటనలో మొదటి రోజు బిజీబిజీగా ముఖ్యమంత్రి కేసీఆర్ బృందం
-లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో సానుకూల సమావేశం
-వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు లియో సంస్థ సంసిద్ధత
-తమ ప్రాంతాలను సందర్శించాలంటూ పలు కంపెనీలు, సంస్థల ఆహ్వానాలు
-లియానింగ్ ప్రావిన్స్ పీపుల్స్ అసోసియేషన్‌తో సమావేశం
-సహకరించిన భారత రాయబారి అశోక్ కే కాంత బృందం
-నేడు ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో సీఎం ప్రసంగం
ఈ పర్యటనలో కీలక అంకమైన ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తొలి రోజైన బుధవారం ఎమర్జింగ్ మార్కెట్ ఎట్ క్రాస్‌రోడ్స్ అనే అంశంపై జరిగే చర్చలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. వర్థమాన దేశాల మార్కెట్ల అభివృద్ధికి గల అవకాశాలపై ప్రపంచ నేతలతో కలిసి ఆయన చర్చించనున్నారు.ఉదయం నుంచే బిజీబిజీ: సోమవారం రాత్రి చైనాలోని డాలియన్ నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్, ఉభయ సభల అధిపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు మంగళవారం ఉదయంనుంచే బిజీబిజీగా గడిపారు. ఉదయం చైనాలో భారత రాయబారి అశోక్ కే కాంత, ఆయన అధికారులతో సీఎం బృందం ప్రత్యేకంగా సమావేశమైంది.

చైనాలో పరిస్థితులు, పరిశ్రమలు, సంస్థలగురించి సీఎం కేసీఆర్‌కు ఆయన వివరించారు. చైనాలో కంపెనీల అవకాశాలతోపాటు భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలనుకూడా భారత రాయబారి అశోక్ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ఐపాస్)ను సీఎం వారికి వివరించారు.

వేయి కోట్ల పెట్టుబడులకు సిద్ధమన్న లియో గ్రూప్
చైనా పర్యటన తొలిరోజు సీఎం బృందం వెయ్యి కోట్ల పెట్టుబడులను సంపాదించింది. లియో గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ లియో వాంగ్ ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర అధికారులు సమావేశమయ్యారు. పెట్టుబడులపై చర్చించారు. ఈ సందర్భంగా లియో కంపెనీ చైర్మన్ లియో వాంగ్ మాట్లాడుతూ రూ.1000 కోట్ల పెట్టుబడులను తెలంగాణలో పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లియో గ్రూప్ కంపెనీ హెవీ డ్యూటీ పంప్‌లు, డిజిటల్ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పుతుంది.

ఆహ్వానాల వెల్లువ..
ఇదిలా ఉండగా తమ ప్రాంతాన్ని సందర్శించాలంటే.. తమ ప్రాంతాన్ని సందర్శించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చైనాలోని పలు ప్రాంతాలు, సంస్థలు, అసోసియేషన్లనుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. ఈ ఆహ్వానాల నేపథ్యంలో చైనాలోని పలు ప్రధాన నగరాలను, ప్రాంతాలను సందర్శించి రాష్ట్ర పారిశ్రామికవిధానానికి మరింత ప్రాచుర్యం కల్పించాలని సీఎం నిర్ణయించారు. ఇందులో భాగంగా చైనా కౌన్సిల్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (సీసీపీఐటీ), షెంజెన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జియాండెయె నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది.

షెంజెన్ నగరంలోని కంపెనీలు భారత్‌లాంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా ఆసక్తిగా, ఉత్సాహంగా ఉన్నాయని కేసీఆర్‌కు పంపిన ఆహ్వాన లేఖలో జియాండె యె పేర్కొన్నారు. ఈ నెల 14న సీఎం, అధికారుల బృందం షెంజెన్‌ను సందర్శించాలని కోరారు. ఈ సందర్భంగా పెట్టుబడులు, వ్యాపారంపై ఇరువురికీ లాభదాయంగా ఉండే అంశాలపై చర్చిద్దామని, ఒకరి అభిప్రాయాలను మరొకరు తెలుసుకుందామని విజ్ఞప్తి చేశారు.

లియానింగ్ రాష్ట్ర సీఈవోలతో భేటీ
లియానింగ్ స్టేట్‌లోని టాప్ 30 కంపెనీల సీఈవోలతో సీఎం కేసీఆర్ సుదీర్ఘమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఇతర ప్రతినిధి బృందం తమ తమ ఆలోచనలను పంచుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలాంశాలను చర్చించారు. చైనాలోని బారత రాయబార కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా (లియానింగ్ ప్రొవిన్షియల్ పీపుల్స్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్‌షిప్ విత్ ఫారిన్ కంట్రీస్) ఆతిథ్యంలో ఎంటర్‌ప్రైజెస్ ఇంటరాక్షన్ సమావేశం జరిగింది. దీనికి డాలియన్ మున్సిపల్ అసోసియేషన్ ఫర్ ఫ్రెండ్‌షిప్ విత్ ఫారిన్ కంట్రీస్, డాలియన్‌లోని తైలింగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలు సహకరించాయి. తొలిరోజు పర్యటనలో భాగంగా డాలియన్‌లోని పలు ప్రాంతాలను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించి, పరిశీలించారు. ఈ సందర్భంగా చైనాలో భారత రాయబారి అశోక్ కే కాంత అక్కడి విశేషాలను, సమాచారాన్ని అందించారు.