కేసీఆర్ మహామంత్రం రాజీనామాలు..ఎన్నికలు

సంకీర్ణయుగంలో ఓట్లు సీట్లే అన్నింటికీ ఆధారం. ఆ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రం సాధిస్తాం .. పార్టీ పెట్టిన రోజునే కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. 14 ఏళ్ల ప్రస్థానంలో అంగుళం కూడా అటుఇటు జరగకుండా అదే పంథాను ఆయన కొనసాగించారు. పార్టీని పటిష్టం చేసుకోవడం ఓట్లు సీట్లు పెంచుకోవడం తన బలాన్ని ప్రదర్శించి మత్తగజాల్లాంటి పార్టీలను లొంగదీసుకోవడం చుట్టూ ఆయన వ్యూహాలన్నీ కొనసాగాయి. అందుకోసం ఆయన ఎంచుకున్న మహామంత్రం రాజీనామాలు. త్యాగానికి.. పవిత్రతకు… ప్రజల తీర్పుకు ప్రతీకగా ఉన్న రాజీనామాలు ప్రజల్లో కేసీఆర్‌ను నిష్కామ కర్ముడిగా నిలిపాయి. రాజకీయ నిరుద్యోగుల నినాదమే తెలంగాణ అన్న అప్రదిష్టను కాలరాస్తూ ఉద్యమం ప్రారంభించిన నాడే కేసీఆర్ పదవులన్నీ వదిలేశారు.

kcr23

స్వరాష్ట్ర సాధన కోసం మహత్తర పోరాటానికి అంకురార్పణ చేసిన 2001 ఏప్రిల్ 27నాడే ఆయన రాజీనామాల పర్వం ప్రారంభమైంది. డిప్యూటీ స్పీకర్ పదవికి, ఎమ్మెల్యేకు, టీడీపీ సభ్యత్వానికి ఏకకాలంలో మూడు రాజీనామాలను వేదికపైనుంచే ప్రకటించారు. ఆ తర్వాత సిద్దిపేట నుంచి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2004లో కేంద్రంలో షిప్పింగ్ మంత్రి పోర్టుఫోలియోను త్యాగం చేశారు. ప్రధాన మంత్రి మన్మోహన్ కేసీఆర్‌ను వర్తమాన రాజకీయాల్లో మీరు రుషితుల్యులు అని ప్రశంసించారు. తర్వాత ఆ పదవిని వదిలేశారు. కరీంనగర్ ఎంపీ సీటుకు రాజీనామా చేసి ఉప ఎన్నికలు ఎదుర్కుని ఘనవిజయం సాధించారు. ఉద్యమ ఎత్తుగడల్లో భాగంగా 2008 ఎన్నికలకన్నా ఆరునెలలు ముందుగానే తాను తన పార్టీ సభ్యులందరితో రాజీనామాలు చేయించి మినీ ఎన్నికలు తెచ్చారు. 2009లొ తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో మళ్లీ ఆయన ప్రజలనే నమ్ముకుని తిరిగి రాజీనామా మంత్రం జపించారు. ఆ ఎత్తుగడే తెలంగాణ చరిత్రను మార్చి వేసింది. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు వచ్చిన ఘనవిజయాలు ప్రత్యర్థి పార్టీల డిపాజిట్ల గల్లంతులే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బీజం వేశాయి.

ఎన్నికలు…
సిద్దిపేట ఉప ఎన్నిక 22-09-2001
కేంద్రమంత్రి పదవికి రాజీనామా మే-2004
కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా 12-09-2006
2,01,582 మెజారిటీతో ఎన్నిక 07-12-2006
టీఆర్‌ఎస్ ఎంపీలు ఎమ్మెల్యేల రాజీనామాలు 03-03-2008
ఉప ఎన్నికలు మిశ్రమ ఫలితాలు 01-06-2008
తెలంగాణ కోసం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల రాజీనామాలు, ఉప ఎన్నికలు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేల విజయం 22-07-2010
ఉప ఎన్నికలు. ఆదిలాబాద్, కామారెడ్డి, స్టేషన్ గన్‌పూర్‌లో టీఆర్‌ఎస్ విజయం 21-03-2012
సింగరేణిలో టీజీబిజీకే విజయం 21-03-2012