చైనా చేరుకున్న కేసిఆర్

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన పది రోజుల చైనా పర్యటన ప్రారంభమైంది. సోమవారం ఉదయం 10 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన సీఎం బృందం రాత్రి 8 గంటల సమయంలో చైనా నగరం డాలియన్ చేరుకుంది. అంతకుముందు ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి కాన్వాయ్‌లో నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం ప్రత్యేక మార్గంగుండా వెళ్లి విమానం ఎక్కారు. అప్పటికే పర్యటనకోసం సిద్ధంగా ఉన్న మంత్రులు, అధికారులతో కలసి సరిగ్గా పది గంటలకు ప్రత్యేక విమానం టేకాఫ్ తీసుకుంది.

CM KCR in China

-డాలియన్ నగరం చేరుకున్న సీఎం బృందం
-పెట్టుబడులే లక్ష్యంగా పది రోజుల పర్యటన
-శంషాబాద్‌లో మంత్రులు, అధికారుల వీడ్కోలు
-పర్యటనకు ముందు సీఎస్, డీజీపీలతో సీఎం సమీక్ష
-ఎర్రవల్లికి ఇండ్లు, పోలవరం ఉద్యోగులకు
పోస్టుల ఫైళ్లపై సంతకాలు
-కాళోజీ జయంతి, హరితహారంపై సీఎస్‌కు సూచనలు
సీఎం బృందం పర్యటన నేపథ్యంలో భద్రతాదళాలు, టీఆర్‌ఎస్ శ్రేణులు, అధికార వర్గాలతో ఎయిర్‌పోర్టు ఉదయం సందడిగా మారింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు విలేకరులతో మాట్లాడుతూ చైనా పర్యటనతో తెలంగాణ రాష్ర్టానికి బహుళప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. కేసీఆర్ ఆశయమైన బంగారు తెలంగాణ సాధనకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు.

సీఎం బృందంలో..: ముఖ్యమంత్రి వెంట పర్యటనకు వెళ్లిన వారిలో ఎంపీ కేశవరావు, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, జగదీశ్‌రెడ్డి, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సీఎంవో అధికారులు నర్సింగ్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరిసుభాష్‌రెడ్డి, టీ న్యూస్ ఎండీ సంతోష్‌కుమార్ తదితరులున్నారు.

బిజీబిజీగా సీఎం..: పర్యటనకు బయలుదేరే ముందు ఉదయంనుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. తనకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిన వారిని పలకరిస్తూనే అధికారులతో సమావేశాలు నిర్వహించారు. పలు నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైన ఫైళ్ల మీద సంతకాలు చేశారు. వివిధ అంశాలకు సంబంధించి ఆదేశాలు జారీచేశారు. ఉదయం మొదట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పది రోజుల పాటు శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు.

పలు నిర్ణయాలు, సీఎస్‌కు సూచనలు..: ఏపీకి కేటాయించిన ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలలో పని చేస్తున్న 233 మంది తెలంగాణ ఉద్యోగులకు సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించి తెలంగాణకు తీసుకువచ్చే ఫైల్‌పై సీఎం సంతకంచేశారు. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లి గ్రామంలో 285 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి ఈ మేరకు వెంటనే ఆదేశాలు జారీచేశారు. అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అన్ని శాఖలపై నిరంతరం సమీక్షలు చేస్తూ సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా సాగేలా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు.

హరితహారం చేపట్టండి..: ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి కారు ఎక్కే ముందు కూడా సీఎస్‌ను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో వర్షాలు బ్రహ్మాండంగా కురుస్తున్నందున వెంటనే హరితహారం కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. వాటర్ గ్రిడ్, ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. కాళోజీ జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. అలాగే జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుతో మాట్లాడిన సీఎం రాష్ట్రంలో కరెంటు పరిస్థితిపై చర్చించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. జలాశయాల్లో నీరు లేనందున, థర్మల్ విద్యుత్‌ను ఉత్పత్తి పెంచడంతో పాటు అవసరమైన మేరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలని ఆదేశించారు.

KCR with Mahmud Ali

పలువురి వీడ్కోలు ..: చైనా పర్యటనకు వెళుతున్న సీఎంకు పలువురు మంత్రులు, అధికారులు క్యాంపు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చైనా పర్యటనలో అంతా శుభం జరగాలని, పర్యటన విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం చేతికి దట్టి కట్టారు. వీడ్కోలు పలుకడానికి వచ్చినవారిలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు, కేటీఆర్,లక్ష్మారెడ్డి , తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగురామన్న, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో అధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు దేవీ ప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, వీ మమత, ఏ సత్యనారాయణ, నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొంద దామోదర్‌రావు, లాయర్ల జేఏసీ నాయకులు ఉన్నారు.