కేసీఆర్ కిట్ సూపర్ హిట్

-సీఎం గొప్ప ఆలోచన ఫలితమే ఈ పథకం
-పథకం ప్రారంభం తర్వాత 93,927 ప్రసవాలు
-రూ.84.87 కోట్లతో 91,148 కిట్లు అందజేత
-ప్రభుత్వ దవాఖానల్లో పెరుగుతున్న ప్రసవాలు
-ప్రసవం తర్వాత ఇంటికి ప్రభుత్వ వాహనంలో చేరవేత
-టీకాలకోసం వచ్చేందుకు ఉచిత రవాణా సదుపాయం
-కేసీఆర్ కిట్స్‌పై అసెంబ్లీలో మంత్రి లక్ష్మారెడ్డి

తల్లీబిడ్డల క్షేమాన్ని కోరుతూ, ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం సూపర్‌హిట్ అయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. దీని విజయాన్ని తట్టుకోలేకే అసెంబ్లీలో విపక్షాలు విమర్శలు చేశాయన్నారు. సహజంగా ఆరోగ్య విభాగంపై వ్యతిరేక కథనాలే ఎక్కువగా వస్తాయన్న మంత్రి.. తొలిసారి కేసీఆర్ కిట్స్ పథకంపై 200లకు పైగా పాజిటివ్ కథనాలు వచ్చాయని వెల్లడించారు. ఇంత మంచి పథకంపై ప్రతిపక్షాలు సానుకూలంగా స్పందించి, మంచి సలహాలిస్తాయనుకున్నా, పాతపద్ధతిలో లొసుగులు చూ డటానికే ప్రయత్నించాయని వ్యాఖ్యానించారు. కడుపులో నలుసు పడ్డప్పటినుంచి ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టేవరకు ప్రభుత్వం బాధ్యత తీసుకునేలా ముఖ్యమంత్రి చేసిన గొప్ప ఆలోచన నుంచే కేసీఆర్ కిట్ పథకం వచ్చిందన్నారు. అసెంబ్లీలో శుక్రవారం కేసీఆర్ కిట్ పథకంపై చర్చకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేసీఆర్ కిట్ పథకాన్ని మహత్తర కార్యక్రమంగా అభివర్ణించారు. ఈ పథకంలో గర్భిణులకు ఆడపిల్ల పుడితే రూ.13 వేలు, మగపిల్లాడు పుడితే రూ.12 వేలు అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడాదికి 6.50 లక్షల ప్రసవాలు జరుగుతే 30% ప్రభుత్వ దవాఖానల్లో జరిగేవని, కేసీఆర్ కిట్ మొదలయ్యాక 55 శాతానికి పెరిగిందని తెలిపారు. కేసీఆర్ కిట్ ప్రారంభించాక ఇప్పటివరకు 93,927 ప్రసవాలు జరుగగా రూ.84.87 కోట్లు ఖర్చుచేసి 91, 148మందికి కిట్లు అందించామని వెల్లడించారు.

ఒకరికి రెండు కాన్పులకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నందునే వ్యత్యాసం ఉన్నదని తెలిపారు. సహజ ప్రసవాలకు అవకాశం ఉండేలా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా లేబర్ రూములు, ఎంసీహెచ్, సీమాంక్ సెంటర్లను, మెటర్నల్ ఐసీయూలు, ఎస్‌ఎన్సీయూలు, బ్లడ్‌బ్యాంక్‌లను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. ప్రసవానంతరం తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటికిచేర్చడానికి కేసీఆర్ కిట్ వాహనం పేరుతో 102 వా హనం ఏర్పాటుచేశామని చెప్పారు. ప్రస్తుతం 200 వాహనాలను ప్రవేశపెడుతున్నామని, త్వరలో వీటిని సీఎం ప్రారంభిస్తారని తెలిపారు. గర్భిణులను ప్రసవాలకోసం హాస్పిటల్‌కు, తర్వాత ఇంటికి ఉచితంగా ఈ వాహనాలు చేరవేస్తాయని చెప్పారు. టీకాలకోసం వచ్చేందుకు ఉచిత రవాణాసదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడాదికి శిశుమరణాలరేటు 39% ఉండగా, మూడేండ్లలో తీసుకున్న చర్యలతో 28 శాతానికి తగ్గిందన్నారు. గర్భిణుల మరణాలు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఏడాదికి 90 ఉండ గా, 70కి తగ్గిందన్నారు. ఇది కేసీఆర్ కిట్స్ పథకం సాధించిన విజయమని వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది కొరత వాస్తమేనని, అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే 2,778 పోస్టులు మంజూరుచేశామని, 10,718 కొత్త పోస్టులమంజూరు ప్రాసెస్‌లో ఉందన్నారు.

డాక్టర్ల కృషితోనే కేసీఆర్ కిట్స్ విజయవంతం
కేసీఆర్ కిట్స్ పథకం విజయవంతంకావడంలో డాక్టర్ల కృషి ఎంతో ఉందని మంత్రి ప్రశంసించారు. వారి కృషిని గుర్తించేలా సీఎం కేసీఆర్ ప్రోత్సాహకాలను ప్రకటించారన్నారు. ప్రతి డెలివరీకి రూ.2వేలు త్వరలోనే అమలుచేస్తామన్నారు. బోధన్ దవాఖానలో పడకల సంఖ్య పెంచుతామని ఒక సభ్యుడు చేసిన విజ్ఞప్తికి మంత్రి హామీ ఇచ్చారు. మేడ్చల్, ఆసిఫాబాద్‌ల్లో కొత్త దవాఖానల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతామన్నారు. దేశంలో తొలిసారిగా కరీంనగర్‌లో 30 మందితో మిడ్‌వైఫ్ ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించామని తెలిపారు. కేసీఆర్‌కిట్ల పథకాన్ని వందశాతం రాష్ట్ర బడ్జెట్‌తో చేపట్టామని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్‌వేసిన ప్రశ్నకు మంత్రి స్పష్టతనిచ్చారు. కేసీఆర్ కిట్ల కోసం రూ.600 కోట్లు అదనంగా బడ్జెట్‌లో కేటాయించినట్టు తెలిపారు. మంత్రి సమాధానం అనంతరం స్పీకర్ మధుసూదనాచారి అసెంబ్లీని సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. అంతకుముందు ఓ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ రక్షిత మంచినీరు అందించకుంటే రోగాలు దరిచేరకూడదన్నదే మిషన్ భగీరథ ఉద్దేశమని తెలిపారు. ఫ్లొరైడ్ రహిత పంటల కోసమే మిషన్ కాకతీయని వివరించారు. గతంలో చేసిన కార్యాలవల్లే కాలుష్యం అధికంగా వచ్చింది అని కాంగ్రెస్‌నుద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు.