కేసీఆర్ కసరత్తు

-సీఎంవోలో తెలంగాణ ఐఏఎస్‌లకు కీలక పోస్టులు
-నర్సింగ్‌రావు, గోపాల్‌రెడ్డి, రాజశేఖరరెడ్డిలకు ఆహ్వానం
-సీఎస్, డీజీపీ, హైదరాబాద్ సీపీల ఎంపికలో తలమునకలు
-జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలుగా సమర్థులకే అవకాశం

KCR with Governor

సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను వేగంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమర్థులైన అధికారులను ఎంపిక చేయటంపై తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. పటిష్ఠ యంత్రాంగం ఉంటేనే భవిష్యత్తుల్లో ఎదురు కాబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవటం సాధ్యమని భావిస్తున్న కేసీఆర్, అందుకు అనుగుణంగా తన వ్యూహ బృందాన్ని తయారు చేసుకొంటున్నారు.

ఇందులో భాగంగా తెలంగాణ ప్రాంతానికి చెందిన సమర్థులైన ఐఏఎస్ అధికారులను గుర్తించి తన ప్రభుత్వంలో కీలక పదవులివ్వాలని భావిస్తున్నారు. అందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సహాయం కూడా తీసుకుంటున్నారు. ఆదివారం గవర్నర్‌ను కలిసి టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా ఎన్నికైనట్లు తెలిపిన కేసీఆర్, సోమవారం మరోసారి గవర్నర్‌తో భేటీ అయ్యి ఆంతరంగిక చర్చలు జరిపారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న తెలంగాణకు చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులను రాష్ర్టానికి రప్పించాలని గవర్నర్‌ను కేసీఆర్ కోరినట్లు సమాచారం.

కోల్ ఇండియా చైర్మన్, 1986 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎస్ నర్సింగ్‌రావును సీఎంవో ముఖ్య కార్యదర్శిగా నియమించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేయాలని కేసీఆర్ స్వయంగా గవర్నర్‌ను కోరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సోమవారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వానికి, కోల్ ఇండియాకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఇతర రాష్ర్టాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఎం గోపాల్‌రెడ్డి, రాజశేఖరరెడ్డికి కూడా తెలంగాణ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని సమాచారం.

ఈ మేరకు వారిద్దరి పేర్లను కూడా కేసీఆర్ ప్రతిపాదించటంతో వారిని కేంద్ర సర్వీస్ నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ మహంతి కేంద్రానికి లేఖ రాశారు. వీరిలో గోపాలరెడ్డిని ముఖ్య కార్యదర్శిగా, రాజశేఖరరెడ్డిని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించే అవకాశాలున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వంలో కీలక శాఖలు ఏమిటి ? సమర్థులైన అధికారులు ఎవరెవరున్నారు ? ఎవరికి ఏ శాఖ కేటాయిస్తే సమంజసంగా ఉంటుంది? అనే అంశాలపై కూడా కేసీఆర్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులలో ఇన్‌సైడర్స్‌తోపాటు తెలంగాణకు కేటాయించే అవకాశాలున్న ఇతర రాష్ర్టాల అధికారుల వివరాలను కూడా ఆయన సేకరిస్తున్నారు.

కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు ఆశిస్తున్న పలువురు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు గత కొన్ని రోజులుగా కేసీఆర్ నివాసానికి వచ్చి వినతులు సమర్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వంలో అతి కీలకమైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పోస్టుల్లో ఎవర్ని నియమించాలనే విషయమై కేసీఆర్ ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చారని అంటున్నారు. ఎక్కువ కాలం సర్వీసు ఉన్నవారికి అవకాశం ఇవ్వాలికానీ, మరీ కొద్ది నెలల్లోనే పదవీ విరమణ చేసే వారికి కీలక పదవులు ఇవ్వరాదనే అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యుత్తు, రవాణా, రెవెన్యూ, వ్యవసాయం, ఆర్థిక, నీటిపారుదల, మున్సిపల్, పట్టణాభివృద్ధి, రోడ్లు భవనాలు తదితర శాఖలకు సమర్థులైన అధికారులను ఎంపిక చేసే పనిలో కేసీఆర్ బిజీగా ఉన్నారు.

తెలంగాణ సాంస్కృతిక వైభవం, భాషా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్, ఆయా రంగాల్లో అనుభవజ్ఞులైన అధికారుల కోసం వెతుకుతున్నారు. క్షేత్ర స్థాయి పరిపాలనకు ఆయువుపట్టయిన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల ఎంపికలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఇక మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఇవ్వాలనేది కేసీఆర్ మాత్రమే నిర్ణయించుకుంటారని టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడే అపాయింటెడ్ డే (జూన్ 2) రోజునే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరిస్తారని, ఆయనతో పాటు పలువురు పార్టీ సీనియర్లు మంత్రులుగా అదేరోజు ప్రమాణం చేస్తారని ప్రచారం జరుగుతున్నది.

తెలంగాణ జెన్‌కో ఆవిర్భావం
తొట్టతొలి కార్పొరేషన్ .. అధికారికంగా ఆర్వోసీ సర్టిఫికెట్ జారీ

తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీ జెన్‌కో) ఆవిర్భవించింది. రాష్ట్ర విభజన ప్రక్రియలో భాగంగా మొట్టమొదట ఏర్పడిన కార్పొరేషన్ టీ జెన్‌కో కావడం గమనార్హం. టీ జెన్‌కో ఏర్పాటును అధికారికంగా ఖరారు చేస్తూ కార్పొరేట్ ఐడెంటిటీ నంబర్ (సీఐఎన్) 94070గా రిజిస్ట్రర్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) సోమవారం సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1.44.15 సెకండ్లకు ఆర్వోసీ తన వెబ్‌సైట్‌లో తెలంగాణపవర్ జనరేషన్ కార్పొరేషన్ (టీ జెన్‌కో) పేరును అధికారికంగా ప్రకటించింది. టీ జెన్‌కోను ధ్రువీకరిస్తూ రిజిస్ట్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన డిప్యూటీ ఆర్వోసీ శశిరాజ్‌ధారా సర్టిఫికెట్ జారీ చేశారు. టీ జెన్‌కోను రూ.1,500 కోట్ల ఆథరైజేషన్ క్యాపిటల్ (మూలధనం)తో ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే.