కేసీఆర్ ఢిల్లీ మిషన్

-నేటి రాత్రి దేశ రాజధానికి… ఏపీ భవన్ శబరి బ్లాక్‌లో బస
-రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులతో భేటీ
-రెండ్రోజులపాటు తెలంగాణ ప్రాజెక్టులు, సదుపాయాలపై విస్తృత సంప్రదింపులు
-హోం, న్యాయ, రైల్వే, వ్యవసాయ అవసరాలపై చర్చలు

KCR-Telangana-1351-300x300

తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా కేసీఆర్ శుక్రవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీకి వెళుతున్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వపరంగా లభించాల్సిన సదుపాయాలు, నిధులకు సంబంధించి ప్రధాని నరేంద్రమోడీకి వివరించనున్నారు. రెండురోజుల పర్యటనలో కేసీఆర్ ప్రధానితో పాటు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కేంద్ర హోంశాఖమంత్రి, న్యాయ, రైల్వే, పట్టణాభివృద్ధి,వ్యవసాయ, ఇంధన శాఖల మంత్రులను కలువనున్నారు. రాష్ర్టానికి ఆయా మంత్రిత్వ శాఖల నుంచి అందాల్సిన సదుపాయాలపై కేసీఆర్ వారితో చర్చించడంతోపాటు నివేదికలు అందించనున్నారు.

ఇతర రాజకీయ ప్రముఖులను కూడా ఆయన కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదమూడో షెడ్యూల్‌లో ప్రతిపాదించిన ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీని వీలైనంత త్వరగా నెలకొల్పాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఖమ్మం జిల్లాలో స్టీల్ ప్లాంట్‌ను అప్పాయింటెడ్ డే నుంచి ఆరునెలల లోపల ఏర్పాటుచేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉంది. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్‌ను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరనున్నారు. తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నాలుగువేల మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్తు ఉత్పత్తికి చర్యలు తీసుకోవటంతోపాటు ఈ మేరకు కోల్ లింకేజీని కూడా ఏర్పాటు చేయాలని కోరనున్నారు.

వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం కేంద్రం చర్యలు తీసుకోవాలని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీని త్వరితగతిన స్థాపించేందుకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా ఆయన విజ్ఞప్తి చేయనున్నారు. తెలంగాణలోని ముఖ్య పట్టణాల నుంచి హైదరాబాద్‌కు రోడ్డు, రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసే సందర్భంలో తెలంగాణకు గ్రేహౌండ్స్ బలగాలను ప్రత్యేకంగా కేటాయించాలని వినతి చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని, అయితే దాని డిజైన్ మార్చి గిరిజనుల సంస్కృతిని పరిరక్షించటంతోపాటు ముంపు ప్రాంతాలు తగ్గేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా కేసీఆర్ వివరించనున్నారు.

కేంద్ర ఆర్థికమంత్రితో కలిసే సందర్భంలో రైతుల రుణమాఫీ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ద్రవ్యలోటు నియంత్రణకు సంబంధించి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అమలుకు రాష్ట్రంలో కొంత మినహాయింపు అవసరమని కోరే అవకాశం ఉంది. అదనంగా రుణాలు తీసుకోవటం, బాండ్లు జారీ చేయటానికి, ఇతరత్రా గ్యారంటీలు ఇవ్వటానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టంలో పరిమితులున్నాయి. ఈ క్రమంలోనే మినహాయింపుల కోసం ప్రత్యేకంగా కేసీఆర్ కేంద్ర ఆర్థికమంత్రికి ప్రతిపాదనలు అందించే అవకాశం ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రితో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమై హైకోర్టు విభజన ఆవశ్యకతను వివరించనున్నారు. ముఖ్యమంత్రి వెంట ఢిల్లీలో రాష్ట్ర ప్రతినిధి వేణుగోపాలాచారి, రామచంద్రుడు తేజావత్ ఉంటారు.

తెలంగాణ సీఎం రాకకు ఏపీ భవన్‌లో ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండురోజుల ఢిల్లీ పర్యటనకు ఏపీభవన్‌లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ, హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్, పట్టణాభివద్ధిశాఖ మంత్రి వెంకయ్య తదితరులను ఆయన కలిసే అవకాశాలున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఢిల్లీకి చేరుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ భవన్‌లోని శబరి బ్లాక్‌కు చేరుకుంటారని తమకు అధికారికంగా సమాచారం అందిందని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని భవన్ అసిస్టెంట్ కమిషనర్ జీ రామ్మోహన్ తెలిపారు. తెలంగాణ సీఎం బసకు శబరి బ్లాక్‌లోని మొదటి అంతస్తును కేటాయించామని, ఆయనతోపాటు వచ్చే అధికారులకు కూడా తగిన వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను లోక్‌సభ టీఆర్‌ఎస్ పక్ష నాయకుడు జితేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీ తొలిసారిగా వస్తున్న తెలంగాణ సీఎం కోసం కాన్వాయ్‌తో సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందును టీఆర్‌ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు. వారితో కూడా కేసీఆర్ సమావేశమయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనలో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్‌లో సైతం ఉద్యోగుల, పోస్టుల విభజన, అతిథి గృహాల విభజన, వాహనాల కేటాయింపు తదితరాలన్నీ పూర్తయినందున తెలంగాణ రాష్ర్టానికి ఎక్కడెక్కడ ఎలాంటి కొరత ఉంది, ఏయే పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేయడమా లేక తెలంగాణ నుంచి వివిధ శాఖల సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపడమా తదితర అంశాలపై కూడా భవన్ అధికారులతోపాటు వ్యక్తిగత కార్యదర్శులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది.