కార్యకర్తలే టీఆర్‌ఎస్ రథసారథులు

-ప్రజాసంక్షేమమే రాష్ట్ర సర్కార్ ధ్యేయం
-టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కేకే
-రేవంత్ ఓ బచ్చా: హోంమంత్రి నాయిని
-రేవంత్ కీలుబొమ్మ: నోముల
-టీఆర్‌ఎస్‌లోకి కమ్యూనిస్టు కార్యకర్తలు

Naini Narsimha Reddy
కార్యకర్తలే టీఆర్‌ఎస్ పార్టీ రథసారథులని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ పటిష్ఠం చేయడానికి కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేత నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో ఉప్పల్, కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన పలువురు సీపీఐ, సీపీఎం కార్యకర్తలు ఆదివారం తెలంగాణ భవన్‌లో పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ ప్రజాసంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నదని తెలిపారు. తెలంగాణ పౌరహక్కుల సాధన కోసమే టీఆర్‌ఎస్ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి అర్థంపర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌ను తిడితే ఏదో పెద్ద లీడర్ అవుతానని అనుకుంటే అది భ్రమనేనన్నారు. చంద్రబాబు తన రేవంత్ ఒక బచ్చా అని, కేసీఆర్‌ను తిట్టిన వారి అడ్రస్ ఉండదని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో టీడీపీకి భవిష్యత్తు ఉండదన్నారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపైనా నాయిని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొన్నాల అవినీతి బాగోతం బయటపెడ్తామని హెచ్చరించారు.

నోముల నరసింహయ్య మాట్లాడుతూ చంద్రబాబు చేతిలో రేవంత్ కీలుబొమ్మ అని వ్యాఖ్యానించారు. ఆయనకు సీఎం కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. ఉప్పల్‌కు చెందిన సీపీఐ నాయకుడు సంపత్ ఆధ్వర్యంలో దాదాపు 200 కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములునాయక్, జూబ్లీహిల్స్ టీఆర్‌ఎస్ నేత సతీష్‌రెడ్డి, ఉప్పల్ టీఆర్‌ఎస్ నేత సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.