కరీంనగర్‌లో ఘనస్వాగతం కేసీఆర్‌కు నీరాజనం

– బతుకమ్మలు, బోనాలతో తరలివచ్చిన మహిళలు
– బారులుతీరి పూలవర్షం కురిపించిన
– విద్యార్థినీ, విద్యార్థులు
– జనసంద్రంగా మారిన కరీంనగర్ రహదారులు

KCR 003
కరీంనగర్ జనసంద్రమైంది. తమ ప్రియతమ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు రావడంతో వేల సంఖ్యలో వచ్చిన జనం.. ఆయనకు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జిల్లా కేంద్రం శివారులోకి చేరుకోగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, జడ్పీ అధ్యక్షురాలు తుల ఉమ, ఎమ్మెల్యేలు ఆయనను సాదరంగా ఆహ్వానించారు.

అప్పటికే అక్కడ బారులు తీరిన విద్యార్థినులు కాన్వాయ్‌పై పూల వర్షం కురిపించారు. అనంతరం ప్రత్యేక బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో ఎక్కిన సీఎం, ప్రజలకు అభివాదం చేస్తూ ప్రదర్శనగా ముందుకు సాగారు. రాంపూర్, కమాన్, సిక్కువాడీ, కరీంనగర్ కార్పొరేషన్ కార్యాలయం, బస్‌స్టేషన్ మీదుగా కలెక్టరేట్ వరకు రెండుగంటల పాటు ర్యాలీ సాగింది. ముఖ్యమంత్రిని చూసేందుకు రహదారికిరువైపులా బారులు తీరిన నగరవాసులు.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. వీరందరికీ అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. బతుకమ్మలు, బోనాలతోపాటు ఒగ్గుడోలు ప్రదర్శన, లంబాడీల నృత్యాలు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు నగరంలోని కమాన్ వద్ద ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు బోయినపల్లి వెంకటరామారావు (కరీంనగర్ గాంధీ) నిల్చొని ఉండగా, గమనించిన కేసీఆర్ బస్సును ఆపించి, కిందకు దిగారు. ఆయనను ఆలింగనం చేసుకొని బస్సులోపలికి తీసుకెళ్లారు. కమాన్ నుంచి కలెక్టరేట్ వరకు వివిధ కళాశాలలకు చెందిన వేలాది విద్యార్థులు రోడ్డుకిరువైపులా బారులు తీరి బెలూన్స్‌తో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కరీంనగర సమగ్రాభివృద్ధి కోసం నగరపాలక సంస్థ రూపొందించిన కేసీఆర్ (కరీంనగర్ సిటీ రెనవేషన్) పథకాన్ని సీఎం ప్రారంభించారు. ప్రత్యేక పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నగరంలో లక్ష మొక్కలు నాటే హరిత హారం కార్యక్రమానికి కార్పొరేషన్ ఆవరణలో అంకురార్పణ చేశారు.

ర్యాలీలో మంత్రి కేటీ రామారావు, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, జిల్లా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, కే విద్యాసాగర్‌రావు, బొడిగ శోభ, ఒడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ సీనియర్ నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, డాక్టర్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు.