ఖరీఫ్‌కు కేఎల్‌ఐ నుంచి సాగునీరు

పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తుందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా బుధవారం ఆయన కేఎల్‌ఐ(ఎంజీఎల్‌ఐ) ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంజీఎల్‌ఐ నుంచి ఖరీఫ్ నాటికి అన్నిమోటార్లను పనిచేయించి, సాగునీరు అందజేస్తామన్నారు. రెండు,మూడో లిఫ్టుల వద్ద నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని చెప్పారు. పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తిచేసేందుకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు.

Harish-Rao-vsited-KLI-project

-యుద్ధప్రాతిపదికన పాలమూరు ప్రాజెక్టులు పూర్తిచేస్తాం
-ప్రతి శుక్ర, శనివారాల్లో ప్రాజెక్ట్, చెరువుల పనులపై సమీక్ష
-కేఎల్‌ఐ సందర్శనలో మంత్రి టీ హరీశ్‌రావు వెల్లడి
జిల్లాలో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు బడ్జెట్‌లో రూ.325 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. ప్రతి శుక్రవారం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై, ప్రతి శనివారం మిషన్ కాకతీయ పథకం అమలుతీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నట్లు చెప్పారు.
కొత్త సచివాలయంపై అనవసర రాద్ధాంతం: ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త సచివాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారే తప్ప వేరే ఉద్దేశం లేదని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. నూతన సచివాలయ నిర్మాణంపై కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు తేవడమే నూతన సచివాలయ నిర్మాణ ఉద్దేశమన్నారు. మంచి ఆలోచన చేయడంతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిఏమి మాట్లాడుతున్నాయో తెలియడం లేదన్నారు.

ప్రభుత్వరంగ సంస్థలైన నిజాం షుగర్స్, ఆల్విన్ సంస్థలను అమ్మినప్పుడు, వక్ఫ్ భూములను ల్యాంకోకు ఇచ్చినప్పుడు తప్పనిపించలేదా అని నిలదీశారు. మీరు ఎన్ని కుంభకోణాలు చేశారో, ఎంతమంది జైలుకి వెళ్లారో ఆలోచించుకోవాలని ప్రతిపక్షాలకు చురకలంటించారు. కార్యక్రమాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాసగౌడ్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్ పాల్గొన్నారు.