కాలుష్యాన్ని సహించం

-పర్యావరణానికి నష్టం కలిగిస్తే ఊరుకోం
-13 పరిశ్రమలను మూసేయించాం
-1,122 కాలుష్య పరిశ్రమలను ఔటర్ బయటకు తరలిస్తాం
-ఇందుకోసం ఔటర్ బయట 17 ప్రాంతాల గుర్తింపు
-కాలుష్యరహిత పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం
-పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు
-పాశమైలారంలో రూ.104 కోట్లతో నిర్మించనున్న వ్యర్థజలాల శుద్ధీకరణ కేంద్రానికి శంకుస్థాపన

పర్యావరణాన్ని విధ్వంసం చేసే కాలుష్య పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకొనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని, అదేసమయంలో పరిశ్రమలు స్థాపించి కాలుష్యం వెదజల్లితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టంచేశారు. ఇప్పటికే కాలుష్యం వెదజల్లుతున్న 13 పరిశ్రమలను మూసివేయించామని తెలిపారు. కొంత నష్టం జరిగినా, తాత్కాలిక ఇబ్బందులు వచ్చినా, ఉద్యోగాలు కోల్పోయినా, కొందరు పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడినా.. తెలంగాణ భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకూడదని కఠిననిర్ణయం తీసుకొన్నామని పేర్కొన్నారు. మనకు పెద్దవాళ్లనుంచి వచ్చిన భౌగోళిక పరిస్థితులకంటే మెరుగైన పరిస్థితులను భవిష్యత్ తరాలకు అందివ్వాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో రూ.104.28 కోట్లతో నిర్మించనున్న వ్యర్థజలాల శుద్ధీకరణ కేంద్రానికి మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్.. పారిశ్రామికీకరణ వేగంగా జరుగాలని, స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాలనే దేశాలు, రాష్ర్టాలు పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తున్నాయని, తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నప్పటికీ, జీవన విధ్వంసం చేసే కాలుష్య పరిశ్రమల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నదని చెప్పారు.

అటవీశాఖ మంత్రితోపాటు, 300 కంపెనీల ఎండీలు, సీఈవోలతో కలిసి కాలుష్యనియంత్రణ మండలిలో సమావేశం ఏర్పాటుచేసి ప్రజలకు, పర్యావరణానికి నష్టం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించిన మొదటి పరిశ్రమలశాఖ మంత్రి తానేనని కేటీఆర్ గుర్తుచేశారు. కాలుష్య పరిశ్రమలను ఔటర్‌రింగ్ రోడ్డు బయటకు తరలించాలని 2013లో జీవో నం.20 ద్వారా అప్పటి ప్రభు త్వంనిర్ణయించిందని, కొన్ని పరిశ్రమలను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నందున అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారని, పరిశ్రమలను తరలించడమంటే సమస్యలను తరలించడం కాదని స్పష్టంచేశారు. పరిశ్రమలను తరలించడానికి ముందే ఆయాప్రాంతాల్లో వ్యర్థ జలాల శుద్ధి యంత్రాలతోపాటు ఇతర అన్నిసౌకర్యాలు ఏర్పాటు చేసుకొనేలా చర్యలు తీసుకొంటున్నామని వివరించారు. పాశమైలారంలో రూ.104 కోట్లతో నిర్మిస్తున్న ట్రీట్‌మెంట్ ప్లాంట్‌తో ఈ ప్రాంతంలోని అన్ని పరిశ్రమల కాలుష్య జలాలను శుద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. వచ్చే డిసెంబర్‌లోగా దీన్ని పూర్తిచేస్తామన్నారు.

పర్యావరణహిత పరిశ్రమలు రావాలి
రాష్ర్టానికి పర్యావరణహిత పరిశ్రమలు రావాలని, అందుకోసం కృషిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పదేపదే సూచిస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో పరిశ్రమల కాలుష్యంతో గతంలో జరిగిన నష్టం పునరావృతం కాకూడదనే కాలుష్య పరిశ్రమలపై కఠినంగా వ్యవహరిస్తూ.. వ్యర్థజలాల ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేలా కృషిచేస్తున్నామన్నారు. పాశమైలారం పారిశ్రామిక ప్రాంతంలో హరితహారంలో భాగంగా లక్షలాది మొక్కలు నాటాలని పారిశ్రామికవేత్తలకు, స్థానిక ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల రెడ్, ఆరెంజ్ విభాగంలో ఉన్న 1,122 పరిశ్రమల్లో 283 పరిశ్రమలను కొత్తగా నిర్మించనున్న ఫార్మాసిటీకి తరలిస్తామని చెప్పారు. ఇతర పరిశ్రమల తరలింపునకు ఔటర్ బయట బూచినెల్లి, రాకంచెర్ల, ఇంద్రకరణ్, పాశమైలారం, అర్కట్ల, నవాబ్‌పేట, లక్డారం, చిట్యాల, ఉస్సేని, చేగూర్, నవాబుపేట, వెల్దుర్తి వంటి 17 ప్రాంతాలను గతంలోనే గుర్తించినట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ రాజమణి, చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఐలా అధ్యక్షుడు చందుకుమార్, ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. పాశమైలారం పారిశ్రామికవాడలోని వెర్సటైల్ ఆటోకంపెనీ తయారు చేసిన వీ-45 ఎలక్ట్రికల్ టూ వీలర్ వాహనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

దుర్మార్గంగా వ్యవహరించొద్దు: మంత్రి కేటీఆర్
కొందరు పారిశ్రామికవేత్తలు మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, వాళ్లెవరో తన కంటే స్థానికులకే ఎక్కువగా తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. తమ చెరువు కాలుష్యంగా మారుతున్నదని గతంలో స్థానికులు ఫిర్యాదు చేయడంతో అప్పటి గవర్నర్ రంగరాజన్ రెండుమూడుసార్లు స్వయంగా పాశమైలారం చెరువును పరిశీలించారని గుర్తుచేశారు. ఇలా చెరువులను విధ్వంసం చేయడం ఎంతవరకు మంచిదని పారిశ్రామికవేత్తలను మంత్రి కేటీఆర్ సూటిగా ప్రశించారు. మరికొందరు పారిశ్రామికవేత్తలు పరిశ్రమల వ్యర్థాలను డమ్మీ బోరుబావుల్లోకి ఇంజక్షన్ ఇచ్చినట్లుగా భూగర్భంలోకి వదులుతున్నారని, దీనివల్ల తాత్కాలికంగా కొన్ని డబ్బులు రావచ్చు, పెట్టుబడి తగ్గొచ్చేమో కానీ శాశ్వతంగా మన పిల్లలకు మాటల్లో చెప్పలేనంత నష్టం చేసి పెడుతున్నామని హెచ్చరించారు. ఇలాంటి వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని పునరుద్ఘాటించారు. కాలుష్య ప్రాంతంగా పేరుపొందిన పాశమైలారం వ్యర్థజలాల శుద్ధీకరణ కేంద్రం ప్రారంభమైన తర్వాత కాలుష్యరహిత పారిశ్రామిక వాడగా ప్రత్యేకత చాటుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.