కలిసికట్టుగా రాష్ట్ర పునర్నిర్మాణం

రాష్ట్ర పునర్నిర్మాణానికి రాజకీయ శక్తుల పునరేకీకరణ కావాల్సి ఉందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. 60 ఏండ్లు పోరాడి, ఎన్నో అవమానాలు భరించి, భారత రాజకీయ వ్యవస్థను మెప్పించి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉందని తెలిపారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ శాసనసభా పక్షనేత తాటి వెంకటేశ్వర్లు శుక్రవారం రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

KCR

-ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్నీ అన్యాయాలే
-త్వరలోనే ఖమ్మం జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తా
-సీఎం కేసీఆర్ వెల్లడి..
-టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు
వెంకటేశ్వర్లుతోపాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, సుమారు రెండువేల మంది కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకటేశ్వర్లుకు, ఇతర ముఖ్య నేతలకు సీఎం గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందామని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వానికి తాటి వెంకటేశ్వర్లు అన్ని విధాలుగా సహకరించారని ప్రశంసించారు.

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, ఖమ్మం జిల్లాలో దుమ్మగూడెం ప్రాజెక్టును రూ.20వేల కోట్లతో నిర్మించినా జిల్లాకు నాలుగు చుక్కల నీరు వినియోగంలోకి రాలేదన్నారు. ఖమ్మం జిల్లాలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పి జిల్లాను అభివృద్ధి చేసుకుందామన్నారు. గోదావరిపై నాలుగు ప్రాజెక్టు నిర్మించుకుంటే ఖమ్మం జిల్లాలో సెంటు భూమి మిగులకుండా సాగులోకి తీసుకురావచ్చని తెలిపారు. త్వరలో ఖమ్మంలో పర్యటించి మూడు రోజులపాటు అక్కడే ఉంటానని, అధికారులు, ప్రజాప్రతినిధులతో కలసి జిల్లా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందామని కేసీఆర్ వివరించారు.

కార్యక్రమంలో డిఫ్యూటీ సీఎం రాజయ్య, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, ఖమ్మం జడ్పీ చైర్‌పర్సన్ కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, కనకయ్య, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ విజయబాబు, టీఆర్‌ఎస్ వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.