కలలు నిజమవుతున్న వేళ..!

ఒక తల్లి ప్రసవ వేదనను భరించి, పండంటి బిడ్డను కని, తన జీవితం సార్ధకమైందని పరవశిస్తుంది. ఒక తండ్రి ఆ బిడ్డను ప్రయోజకున్ని చేసేందుకు తన సకలశక్తులను ఒడ్డి ధన్యుడవుతాడు. ఒక గురువు తన జ్ఞానాన్నంతా ధారబోసి, ఆ బిడ్డ స్వతంత్రంగా ఎదిగి ప్రపంచంతో పోటీపడి గెలిచి, తన కాళ్ళ మీద తాను నిలబడే అస్తిత్వాన్నందించి ఆదర్శప్రాయుడుగా నిలుస్తాడు. తెలంగాణకు పునర్జన్మను ప్రసాదించి, దాని ఎదుగుదలకు అనుక్షణం తన శక్తియుక్తులన్నింటినీ ఒడ్డుతూ, మనం బలమైన శక్తిగా ఎదిగి ఈ ప్రపంచాన తల ఎత్తుకు నిలిచే సత్తాను మనకు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు తల్లి, తండ్రి, గురువు, అన్ని తానే అయి నడిపిస్తున్న నవ తెలంగాణ నిర్మాత. నిత్య స్ఫూర్తి ప్రదాత!

స్వామి భక్తితో అంటున్న మాటలు కావు ఇవి. సాక్షీభూతమై నిలుస్తున్న ఆయన కార్యాచరణయే కొలబద్దగా చేస్తున్న వాస్తవ విశ్లేషణ. ఓట్లతో గెలిచి, సీట్లు సాధించి, అందివచ్చిన అధికారాన్ని చెలాయిస్తూ, సమస్యలను ఏళ్ళకు ఏళ్ళు దాటవేస్తూ, కాకుంటే తాత్కాలిక పరిష్కారాలను చూపుతూ, నెరవేరని హామీలతో, స్కాములతో ప్రజా జీవితాల్ని అతలాకుతలం చేసిన గత పాలకుల నయవంచక పాలనను దశాబ్దాలుగా మనం అనుభవించాము.

అందుకే అభివృద్ధి అధ: పాతాళంలో ఉండిపోయింది. కానీ, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి రాజీపడని రాజనీతిజ్ఞతతో, వేగవంతమైన నిర్ణయాలతో, ఆకాశమే హద్దుగా అభివృద్ధియే లక్ష్యంగా ప్రకటించి పను లు ప్రారంభించిన పథకాలు తెలంగాణ బంగారు భవితవ్యానికి నిలువెత్తు సాక్ష్యమై నిలుస్తున్న బలమైన సంకేతాలు. పాలకుడికి తమ గత వైభవ చరిత పట్ల లోతైన అధ్యయనం ఉండాలి. ప్రజా జీవితాలను ప్రభావితం చేసే వర్తమాన విషయాల పట్ల వివేకవంతమైన విశ్లేషణ ఉండాలి. తరతరాల అభ్యున్నతిని సుస్థిరపరచే భవిష్యత్ నిర్మాణం పట్ల మేధోపరమైన దార్శనికత ఉండాలి. అప్పుడే సమర్థుడిగా తాననుకున్నవి సాధించగలుగుతాడు. కేసీఆర్‌లో ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి. అనుకున్నది సాధించేవరకు విశ్రమించని అంకితభావమూ ఉంది. అందుకు తెలంగాణ సాధనే బలమైన ఉదాహరణ!

అసలు తెలంగాణ ఉద్యమం ఆశించిందేమిటి? ఈ ప్రశ్నలోంచే మన భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సి ఉన్నది. విద్యార్థుల బలమైన ఆశ తాము చదివిన చదువులకు తగ్గ కొలువులు దక్కాలని! అందుకోసం టి.పి.ఎస్.సి.ని ఏర్పాటు చేసి లక్ష పై చిలుకు ఉద్యోగాల భర్తీకి కసర్తు చేస్తున్న విషయం మనం కళ్ళారా చూస్తున్నాం.

ఐ.టి. రంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపే చర్యలను వేగవంతం చేస్తూ, ఉద్యోగ, ఉపాధి రంగంలో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ఖరారు చేస్తున్నారు. కవుల కల.. మన భాషయాసలకు పట్టం కట్టి, మన సంస్కృతి అగ్రభాగాన నిలబెట్టడమే కదా! పాఠ్యపుస్తకాల రూపకల్పనలో తెలంగాణ జీవద్భాషను పరిపుష్ఠం చేసుకొనే బాధ్యతను, మన చారిత్రక వైతాళికులను పాఠ్యాంశాలలో చేర్చే స్వేచ్ఛను కవులుభాషా శాస్త్రవేత్తలకు అప్పగించారు. దీనితో పాటుగా కాళోజీ, దాశరథులతో పాటు మిగతా ప్రాత:స్మరణీయుల జయంతి వర్థంతులు ఘనంగా నిర్వహిస్తూ చారిత్రక, సాంస్కృతిక పునర్‌వైభవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు.

దళిత, గిరిజనుల ఆకాంక్ష ఆత్మగౌరవ జీవితాన్ని జీవించడం. అందుకోసం వారికి మూడెకరాల భూమిని ఇస్తూ, కళ్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టారు. వారు తలెత్తుకొని జీవించే మార్గాన్ని సుగమం చేస్తున్నారు. మైనార్టీల మనోవాంఛ స్వేచ్ఛాయుత ఎదుగుదల! ముస్లింలకు షాదీముబారక్‌తో పాటు 12 శాతం రిజర్వేషన్ల సాధనకు కృషి చేస్తూ, దళిత క్రిస్టియన్లకు మూడెకరాల భూమితో పాటు మిగతా దళిత ప్రయోజనాలన్నింటినీ ప్రకటించడం వారి సమాన ఎదుగుదలకు దోహం చేసేవే కదా! రైతుల ప్రధాన కోరిక పంటలు పచ్చదనంతో కలకలలాడడం. అపలను మాఫీ చేసి ఆదుకోవడం! ఇందుకోసం 4200 కోట్ల ఏకమొత్తంతో మొద టి విడత రుణమాఫీ చేసారు.

6500 కోట్లతో చెరువులు పునరుద్ధరించే మిషన్ కాకతీయ పథకం ద్వారా రైతన్న పచ్చగా వర్థిల్లేలా ఆశీర్వదించబోతున్నారు. ఇక మేధావులు మదనపడేది ఉన్నత విద్య, ఉత్తమ వైద్యం, సర్వజన హితమే కదా! కె.జి. నుండి పి.జి. వరకు ఉచిత విద్య కేసీఆర్ డ్రీం ప్రాజెక్టు అమలు కోసం అడుగులు వేస్తున్నారు. వైద్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు, సాంకేతిక విద్యలో గుణాత్మకమైన మార్పు, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి చర్యలు, ఎయిమ్స్ స్థాయి హాస్పిటల్స్ ఏర్పాటుకు చర్యలు ఇవేకాకుండా ఆసరా నుంచి మొదలుకొని వాటర్‌గ్రిడ్ వరకు మన జీవితాల్ని సుఖమయం చేయబోయే పథకాలు ప్రకటిస్తున్నారో చూసినపుడు అందరి ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కేసీఆర్ కార్యాచరణ స్పష్టమవుతుంది.

మేధావులు పాలకుల అవినీతి పట్ల మౌనం వహించడం ఎంత తప్పో… అభివృద్ధి చర్యలను సమర్థించకపోవడమూ అంతే తప. ప్రజాస్వామిక వ్యవస్థలో గల పరిమితులకు లోబడి గరిష్ఠ స్థాయిలో అమలు చేయబూనిన, అభివృద్ధికి ఊతమిచ్చే ప్రతి పథకానికి, దాని కార్యాచరణకు మద్దత్తు తెపాల్సిన కర్తవ్యం ప్రగతికాముకులైన ప్రతి తెలంగాణవాదిపైనా ఉంది. కొత్త రాష్ట్రం కొత్త ప్రభుత్వం కొత్త పాలన అన్న నినాదంతో కేసీర్ కొంగ్రొత్త ఆలోచనలతో, అవినీతికి తావులేని పారదర్శక పాలనకై పాదులు వేస్తున్నారు. ఎక్కడ ఏ సమస్యతో ముడివడి ఉన్న అంశమైనా వెంటనే పరిష్కారాన్ని సూచిస్తూ, వేగవంతమైన నిర్ణయాలతో, తానే ఒక మిషన్‌గా పనిచేస్తున్నారు.

పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రపంచం మెచ్చే నూతన విధానాన్ని ప్రకటించడంతో పాటు ఫార్మాసిటీ, ఫిల్మ్‌నగర్, వైమానిక పారిశ్రామిక పార్కులు, ఇంకా ఎన్నో భారీ వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. నగరవాసుల జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసే మెట్రో రైలుతో పాటు, ప్రతి జిల్లా కేంద్రానికి నాలుగు లైన్ల రోడ్లు, ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తూ ప్రణాళికలు సిద్ధం చేయడం మౌళిక రంగాల అభివృద్ధిని వేగవంతం చేయడమే!

ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారందరికీ వివిధ హోదాల్లో పదవులిచ్చి సముచిత స్థానం కల్పించడం ఆయనకున్న గొప్ప కన్‌సర్న్! మంత్రి పదవుల కూర్పులో సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ, అందరికీ న్యాయం చేయడం, పార్టీ ఆవిర్భావం నుంచి కెసిఆర్‌ను నమ్ముకోవడంతో పాటు ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వాళ్ళందరూ ఆయన దృష్టిలో ఉన్నారు. అర్హతను బట్టి, అవకాశాన్ని బట్టి ఎవరికీ అన్యాయం జరుగకుండా నియామకాలు చేస్తున్నారు.

కేసీఆర్ వేసే ప్రతి అడుగు అభివృద్ధి వైపు సాగుతున్నది. చేసే ప్రతి నిర్ణయం ప్రజా జీవితాల్లో సమూల మార్పులను కలగంటుంది. కలలు నిజమవుతున్న వేళ… ఉద్యమంలో కలిసి కట్టుగా నిలిచి గెలిచినట్లుగానే అభివృద్ధికై సాగే పయనంలోనూ కలిసి అడుగులేద్దాం! శత్రువు ఇంకా పక్కలో పామై పొంచి ఉండి, సమయం చిక్కితే కాటేయడానికి ఎదురుచూస్తున్నాడు.

విభజన చట్టంలో మార్పులు తెరమీదికి తెస్తూ, శ్రీశైలం నీటి వినియోగం ఎగువ నీటి దారి మల్లింపు పట్ల కొత్త ప్రతిపాదనలు పాచికలుగా విసురుతున్నాడు. అస్థిరపరచే వార్తలతో పత్రికలను వేదికలుగా మలుచుకొని కుట్రల వల విసురుతూనే ఉన్నాడు. జాగరూకత ఎంతో అవసరం!

మనకు పుష్కలమైన ల్యాండ్ బ్యాంక్, అద్భుతమైన భౌగోళిక స్థితి, అన్ని రంగాలలో ప్రగతి సాధించగల మేధోసంపత్తి, ఘనమైన సాంస్కృతిక సమ్మిళిత స్థితి, ఐక్య పోరాటంతో రాష్ర్టాన్ని సాధించుకున్న ఉద్యమ స్ఫూర్తి, తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దాలన్న ధృఢ సంకల్పమున్న కేసీఆర్ నాయకత్వ శక్తి . . మనం కలగన్న తెలంగాణను నిజం చేసుకోగలమన్న విశ్వాసాన్ని ప్రోధి చేస్తున్నాయి. ఇపడు కావల్సిందల్లా అభివృద్ధి కోసం అందరం అందరి కోసం అభివృద్ధి అన్న నినాదాన్ని గుండెల నిండా నింపుకొని తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ఉద్యమ స్ఫూర్తిని చాటాలి. మనమంతా సప్తస్వర మేళవింపుతో ఐక్యతా రాగాన్నాలపిస్తే… అభివృద్ధి దిశగా దూసుకుపోవడాన్ని ఆపే శక్తి ఈ లోకంలో ఎవరికీ ఉండదు.

రచయిత : నారదాసు లక్ష్మన్ రావు ( శాసనమండలి మాజీ సభ్యులు)