జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు

– ఆధునిక హంగులతో జర్నలిస్టు భవన్: సీఎం

KCR-02
ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు త్వరలో హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చెప్పారు. మీడియాలో పనిచేసే జర్నలిస్టులందరికీ ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు అందజేస్తుందన్నారు. ఆధునిక హంగులతో హైదరాబాద్‌లో జర్నలిస్టు భవన్ నిర్మిస్తామన్నారు. ఇప్పటికే రూ.10 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఆర్‌ఐ చంద్రవదన్‌తో గురువారం సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. త్వరలో తెలంగాణ ప్రెస్ అకాడమీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి.. విధి విధానాలు ఖరారు చేసుకోవాలని సీఎం సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇంకా ఆంధ్రా ధోరణి కనిపిస్తుందని.. ఈ విషయంలో సమార్పులు తీసుకొచ్చేందుకు అకాడమీ చొరవ చూపించి అవసరం ఉన్నదన్నారు. అకాడమీ నిర్వహణకు నిధుల కొరత లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

సీఎంకు కతృజ్ఞతలు: టీడబ్ల్యూజేఎఫ్
గుర్తింపు పొందిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడి సోమ య్య, బసవపున్నయ్య ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. డెస్క్‌లో పని చేసే జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.