జోరుగా.. సభ్యత్వ నమోదు

-ఉత్సాహంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు
-ఇంటింటికీ తిరిగి నమోదు చేయిస్తున్న పార్టీ శ్రేణులు

Membership drive01

టీఆర్‌ఎస్ చేపట్టిన పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరు.. హుషారుగా సాగుతున్నది. గురువారం నాటికి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్‌ఎస్ సభ్యత్వాలు 5.70 లక్షలు పూర్తయినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇప్పటికి 5.30 లక్షల సభ్యత్వాలు కంప్యూటర్‌లో ఎంట్రీ అయినట్లు చెప్పారు. మరో రెండు రోజులు గడువు ఉండటంతో ఆన్‌లైన్ ఎంట్రీలు పూర్తి చేస్తామని చెప్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన సభ్యత్వం లక్ష్యానికి మించిపోయినందున పార్టీపై ప్రజలకు సేవచేసే బాధ్యత భరింత పెరిగిందని దేవాదాయ, గృహనిర్మాణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

నిర్మల్ పట్టణంలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఆయా వార్డుల్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, యువకులు పార్టీలో చేరి సభ్యత్వాలు స్వీకరించారు. దేశ చరిత్రలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీగా టీఆర్‌ఎస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కేసీఆర్ నేతృత్వంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్‌చక్రవర్తి, టీఆర్‌ఎస్ నాయకులు గౌతంరెడ్డి, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మందమర్రి మండలం సండ్రోన్‌పల్లిలో నిర్వహించిన కార్యక్రమానికి పార్టీ సభ్యత్వ నమోదు కన్వీనర్ ఒడ్నాల కొంరయ్య పాల్గొన్నారు. చెన్నూరులో వార్డుల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో జెడ్పీ ఉపాధ్యక్షుడు మూల రాజిరెడ్డి మాట్లాడుతూ మండలంలో లక్ష్యం మేరకు సభ్యత్వ నమోదు ఎప్పుడో పూర్తయిందన్నారు.

కాసిపేట మండలం ముత్యంపల్లి, కాసిపేటలో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రౌత్ సత్తయ్య చేతుల మీదుగా సభ్యత్వ నమోదు స్లిప్‌లను మహిళలకు, యువతీ, యువకులకు అందించారు. కరీంనగర్ మండలం తాహెర్‌కొండాపూర్, మహదేవపూర్ మండలంలో సభ్యత్వ నమోదు కొనసాగింది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సభ్యత్వ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు బొంతు రామ్మోహన్‌లు పార్టీ సభ్యత్వాన్ని అందచేశారు.