జోడేఘాట్‌లో టూరిజం సర్యూట్

-8న ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు
-సమీక్షా సమావేశంలో సీఎం నిర్ణయం
-8న ఘనంగా కొమురం భీం జయంతి వేడుకలు
-200 ఎకరాల్లో మెమోరియల్ ఏర్పాటు
-శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
-ఆయన పేరిట ప్రపంచ, భారత గిరిజన సదస్సులు
-వేడుకల సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయాలు

CM KCR review with officers on Komuram Bheem jayanthi

గిరిజన పోరాటయోధుడు కొమురం భీం నివాసస్థలమైన ఆదిలాబాద్ జిల్లా జోడేఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్ తరహాలో జోడేఘాట్ కేంద్రంగా టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయాలని నిశ్చయించింది. అక్టోబర్ 8న కొమురం భీం జయంతి వేడుకల నిర్వహణ విషయమై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కొమురం భీం జయంతి ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జల్, జంగల్, జమీన్ కోసం కొమురం భీం పోరాడారని, అలాంటి వ్యక్తి చరిత్రను సైతం మనవాళ్లు తెలుసుకోలేనంతగా సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యం చేశారని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కొమురం భీం అంటే ఎవరు? ఆయన చేసిన త్యాగాలేమిటి? అన్నది ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

జోడేఘాట్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ప్రపంచ గిరిజన ఉత్సవాలు,భారతీయ గిరిజన సదస్సును కొమురం భీం పేరిట నిర్వహిస్తామని ప్రకటించారు. భారత్‌కు కశ్మీర్ మాదిరిగా.. తెలంగాణకు పైభాగంలో ఆకుపచ్చని అడవితో ఆదిలాబాద్ జిల్లా ఉందని, ఈ జిల్లాను మరింత రమణీయంగా మారుస్తామని తెలిపారు. కుంటాల జలపాతం, కవ్వాల్ పులుల సంరక్షణ ప్రాజెక్టుపై మరింత శ్రద్ధపెట్టి జిల్లాను అందంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు త్వరలోనే విమాన సౌకర్యం కల్పిస్తామని, రోడ్డు రవాణాను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. కొమురం భీం పుట్టిన ప్రాంతంలోనే గిరిజన యూనివర్సిటీ నెలకొల్పే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
కొమురం భీం జీవిత విశేషాలతో ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. కొమురం భీం స్మారకార్థం సుమారు 200 ఎకరాలను సేకరించి మెమోరియల్‌ను స్థాపిస్తామని ప్రకటించారు.అక్టోబర్ 8న ఈ మెమోరియల్‌కు తాను శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ మంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.