జిల్లాల్లోనూ షీ టీమ్స్

-మహిళల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 181
-ఈవ్ టీజింగ్ నిరోధానికి పకడ్బందీగా చట్టం అమలు
-హోంశాఖ నియమకాల్లో 33 శాతం రిజర్వేషన్లు
– ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
– ప్రతి ఠాణాలో మహిళా విభాగం
– సీఎం కేసీఆర్ ఆదేశాలు
– పూనం కమిటీ ప్రతిపాదనలపై సమీక్ష

KCR Review Meeting with Officials on Women Safety

రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళలకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 181 టోల్‌ఫ్రీ నంబర్‌తో ఈ హెల్ప్‌లైన్‌తోపాటు, ప్రస్తుతం హైదరాబాద్‌లో విజయవంతంగా అమలుచేస్తున్న షీ టీమ్స్‌ను అన్ని జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసుశాఖలోని అన్ని స్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కచ్చితంగా మహిళా విభాగం పనిచేయాలని సీఎం సూచించారు.

ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మహిళల సమస్యలు-పరిష్కార మార్గాలు అనే అంశంపై అధ్యయనం చేసిన పూనం మాలకొండయ్య నేతత్వంలోని కమిటీ చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రతా కమిటీ తమ సిఫార్సులను సీఎం కేసీఆర్‌కు అందజేసింది. ఈవ్‌టీజింగ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. బస్సులు, బస్టాపులు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు అమలుచేస్తున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈవ్‌టీజర్లను గుర్తించడానికి నిఘా పెట్టామని, ఈవ్‌టీజర్ల ఫొటోలు తీస్తున్నామని, ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా ఈవ్‌టీజర్ల తల్లిదండ్రులకు,కళాశాల యాజమాన్యాలకు కూడా లేఖలు రాస్తున్నట్లు వెల్లడించారు. కోఠీ, మెహిదీపట్నం, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్ ఎక్కువగా జరుగుతున్నదని గుర్తించినట్లు అధికారులు చెప్పారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి…
జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో ముందు వైపు మహిళలు, వెనుకవైపు పురుషులు ఎక్కి దిగేలా చూడాలన్నారు. కండక్టర్ రెండువైపులా తిరిగే విధంగా మధ్యలో ైస్లెడర్ ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళలకు సమాజంలో ఏ మాత్రం గౌరవం దక్కడం లేదని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత ప్రతి ఒక్కరికి సంబంధించిన అంశమని, వారి గౌరవాన్ని కాపాడటం, వారి భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. షార్ట్‌ఫిల్మ్‌లు, అడ్వైర్టెజ్‌మెంట్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. ఆటోరిక్షాలు, ట్యాక్సీల నిర్వహణను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, వాటి యజమానులు, డ్రైవర్ల వివరాలను పోలీసుల వద్ద ఉండాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీయాలని చెప్పారు.

షి ఆటోలు, ట్యాక్సీలు…
హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, పట్టణాల్లో షి ఆటోలు, ట్యాక్సీలు నడపాలని సీఎం కేసీఆర్ సూచించారు. మహిళా డ్రైవర్లకు 50 శాతం సబ్సిడీపై వాహనాలను సమకూరుస్తామని వెల్లడించారు. భ్రూణ హత్యలను నిరోధించేందుకు, ఆడపిల్లలను చంపడాన్ని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు. గుడుంబా వల్ల చాలామంది చనిపోతున్నారని, 25-30 ఏండ్ల యువతులే వితంతువులుగా మారాల్సి వస్తున్నది చెప్పారు. గుడుంబా, నాటు సారాను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కూడా అధ్యయనం జరపాలని సీఎం ఆదేశించారు. రెస్క్యూ హోంలలో ఉంటున్న అమ్మాయిలు, యువతులు, మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి పోషణ కోసం ప్రస్తుతం నెలకు ఇస్తున్న రూ.750 సరిపోవడం లేదని, ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

అన్ని రంగాల్లో మహిళలకు పురుషులతో సమానమైన వేతనాలు అందించాలని, వివక్ష చూపితే హెల్ప్‌లైన్ ద్వారా పరిష్కరించాలని చెప్పారు. ప్రభుత్వంలోని అన్నిశాఖలలో మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వడంతోపాటు అన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, స్వాతి లక్డా, సౌమ్య మిశ్రా, స్మితా సబర్వాల్, చారుసిన్హా, శైలజారామయ్యార్, రమణరావు, రేమండ్ పీటర్, చంద్రవదన్, హర్‌ప్రీత్‌సింగ్, సునీల్, జర్నలిస్టు ప్రేమ తదితరులు పాల్గొన్నారు.

హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్ 181
మహిళలు తమ సమస్యలను చెప్పుకోవడానికి వీలుగా 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. మహిళల కోసం పనిచేసే వివిధ సంస్థలు, వ్యక్తులు, అధికారులను సమన్వయపర్చుకుంటూ హెల్ప్‌డెస్క్ ప్రభావవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో విజయవంతంగా అమలుచేస్తున్న షీ టీమ్స్‌ను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో మహిళల భద్రత కోసం చపడుతున్నకార్యక్రమాలను జిల్లాలకు కూడా విస్తరించాలని, పతి జిల్లాలో ఓ డీఎస్పీ స్థాయి అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలన్నారు.

పోలీసుశాఖలోని అన్ని స్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కచ్చితంగా మహిళా విభాగం పనిచేయాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఉన్న డీఎంఏ ల్యాబరేటరీని బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాల్లో ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. సెల్‌ఫోన్, ఇంటర్నెట్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సమాచార సాధనాల ద్వారా మహిళలను వేధిస్తున్నారని, దీనిని అరికట్టడానికి ఐటీచట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. చైనా, గల్ఫ్ దేశాల మాదిరిగా సోషల్ మీడియాపై నియంత్రణ ఉండే అవకాశాలను పరిశీలించాలన్నారు.